Telugudesam: కోడిని కోసుకు తింటే చికెన్ పార్టీ .. మధ్యతరగతి మనిషిని కోసుకుతింటే భారతీయ జనతా పార్టీ!: గంటా శ్రీనివాస్

  • నవ్యాంధ్రలో 17 జాతీయ సంస్థలకు 3508 ఎకరాలు కేటాయించాం
  • కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది
  • కేంద్రం కావాలనే ఏపీకి అన్యాయం చేస్తోంది

భారతీయ జనతా పార్టీపైన, కేంద్ర ప్రభుత్వంపైన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కోడిని కోసుకు తింటే చికెన్ పార్టీ .. మేకను కోసుకు తింటే మటన్ పార్టీ.. అదే, మధ్యతరగతి మనిషిని కోసుకు తింటే భారతీయ జనతా పార్టీ’ అని మండిపడ్డారు. నవ్యాంధ్రలో 17 జాతీయ సంస్థలకు 3508 ఎకరాలు కేటాయించామని అన్నారు. జాతీయ సంస్థలకు స్థలం ఇవ్వలేదు, గోడలు కట్టలేదంటూ కేంద్రం కుంటిసాకులు చెప్పడం తగదని, తాము స్థలం ఇవ్వనందుకే ఏపీకి నిధులు ఇవ్వలేదని కేంద్రాన్ని చెప్పమనండి! కేంద్రం కావాలనే ఏపీకి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

నిజాలు చెప్పలేని పరిస్థితిలో గంటా ఉన్నారు : ఎమ్మెల్సీ మాధవ్

కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ విద్యా సంస్థల గురించి గంటాకు నిజాలు తెలుసని, ఆ నిజాలు చెప్పలేని పరిస్థితిలో ఆయన ఉన్నారని విమర్శించారు. తాడేపల్లిగూడెం నిట్ నిర్మాణం సగంలోనే ఆగిపోవడానికి కాంట్రాక్టరే కారణమని, ఆ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడానికి ఏడాదిన్నర సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు నిమిత్తం నాలుగు నెలల క్రితమే భూమి ఇచ్చారని మాధవ్ అన్నారు.

More Telugu News