చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

04-04-2018 Wed 18:28
  • ఏపీ అభివృద్ధికి ఏమేం చేయాలో అవన్నీ చేశాం
  • ఇంకా చేస్తున్నాం
  • వైసీపీతో బీజేపీ స్నేహం పెంచుకోవడం లేదు
  • ఇప్పుడు టీడీపీ నేతలు కాంగ్రెస్ నేతలను కలుస్తున్నారు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఏమేం చేయాలో అవన్నీ చేశామని, ఇంకా ఏమేం చేయాలో చేస్తామని తాము రాజకీయ లబ్ది కోసం ప్రయత్నించడం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజాలు లేవని అన్నారు.

అభివృద్ధి విషయంలో తాము రాజకీయాలు చేయమని, ఎన్డీఏ నుంచి టీడీపీ విడిపోయాక కూడా ఏపీ అభివృద్ధికి కట్టుబడే ఉన్నామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. తాము స్నేహం కంటే భారత ప్రజలు, అభివృద్ధికే ఎక్కువ విలువ ఇస్తామని చెప్పుకొచ్చారు. తాము గతంలో టీడీపీతో కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశామని, ఇప్పుడు టీడీపీ నేతలు కాంగ్రెస్ నేతలను కలుస్తున్నారని విమర్శించారు.

అమిత్‌ షా ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి అందులో ఏపీకి ఏమేం చేశామో చెప్పారని ప్రకాశ్‌ జవదేకర్ అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు కూడా తాము సాయం చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్ సీపీతో బీజేపీ స్నేహం పెంచుకుంటోందంటూ టీడీపీ హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తోందని, అటువంటి ప్రయత్నాలు తాము చేయడం లేదని అన్నారు. తాము దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు.