apcc: బీజేపీ అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది!: ఏపీసీసీ

  • దేశంలో దళితులు, ఆదివాసీలపై దాడులకు వ్యతిరేకంగా నిరసనలు
  • రేపటి నుండి ఈనెల 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కుల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేయాలని ఏపీసీసీ పిలుపు

దేశంలో దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రేపటి నుండి ఈ నెల 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏపీసీసీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగ పరిరక్షణకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కుల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేయాలని కోరారు.

బాబు జగజ్జీవన్ రాం, డా.బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా ఫులే విగ్రహాల వద్ద కాంగ్రెస్ శ్రేణులంతా చేరి బీజేపీ ప్రభుత్వంలో దళితుల, ఆదివాసులపై జరుగుతున్న దాడులు, చట్టాల నిర్వీర్యం అవుతున్న తీరును నిరసించాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా పిలుపునిచ్చారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు దళితుల, ఆదివాసీల అత్యాచార నిరోధక చట్టంను నిర్వీర్యం చేసే విధంగా ఉందని, దీనిపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీసీసీ డిమాండ్ చేస్తోందన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగంను మార్చేందుకు కుట్ర జరుగుతోందని, బలహీన వర్గాల హక్కులు ఒక పథకం ప్రకారం తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దాడులు చేసే వారికి మోదీ రక్షణగా ఉంటున్నాడు కాబట్టే దళితులపై, ఆదివాసుల పైన దాడులు జరుగుతున్నాయని ఈ సందర్బంగా ఏపీసీసీ చీఫ్ పేర్కొన్నారు.

More Telugu News