Commonwealth Games: నేటి నుంచి కామన్వెల్త్ క్రీడా సంబరం.. 17 క్రీడాంశాల్లో పోటీపడుతున్న భారత్

  • 12 రోజులపాటు క్రీడా పండుగ
  • సత్తా చాటేందుకు సిద్ధమైన 71 దేశాల క్రీడాకారులు
  • 17 క్రీడాంశాల్లో పోటీపడుతున్న భారత్

నేటి నుంచి కామన్వెల్త్ క్రీడా సంబరం మొదలు కానుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ క్వీన్స్‌లాండ్‌లోని కర్రారా మైదానంలో క్రీడలు మొదలు కాబోతున్నాయి. ఈనెల 15 వరకు జరిగే కామన్వెల్త్ క్రీడల్లో 71 దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం 19 క్రీడాంశాలలో 275 విభాగాల్లో పోటీలు జరగనుండగా 4500 మంది అథ్లెట్లు పథకాల కోసం పోటీ పడనున్నారు.

భారత్ 17 క్రీడాంశాలలో పోటీ పడుతోంది. 115 మంది పురుష అథ్లెట్లు, 105 మంది మహిళా అథ్లెట్లతో మొత్తం 225 మంది గోల్డ్‌కోస్ట్ చేరుకున్నారు. ఈసారి అత్యధిక పతకాలతో భారత్ తిరిగి రావాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఏవోసీ) పట్టుదలగా ఉంది.

ఇప్పటి వరకు 16 సార్లు భారత్ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంది. 1930లో జరిగిన క్రీడల్లో భారత్  ఒకే ఒక్క కాంస్య పతకం సాధించి సంతృప్తి పడింది. 1958లో తొలిసారి స్వర్ణం కొల్లగొట్టింది. ఆ తర్వాతి నుంచి భారత ఆటగాళ్లు కామన్వెల్త్‌లో పతకాలు కొట్టుకు రావడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. ఢిల్లీలో భారత్ ఆతిథ్యమిచ్చిన సీడబ్ల్యూసీ గేమ్స్‌లో 39 స్వర్ణాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది .

More Telugu News