Maharashtra government: అనాథలకు విద్య, ఉద్యోగాల్లో 1 శాతం రిజర్వేషన్.. 'మహా' సర్కార్ నిర్ణయం

  • తల్లిదండ్రులు, బంధువులు లేని అనాథలు అర్హులు
  • వసతి గృహాల్లో ప్రవేశం, స్కాలర్‌షిప్‌లలో ప్రాధాన్యత
  • అనాథంటూ ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్ తప్పనిసరి
  • మహారాష్ట్ర ప్రభుత్వ అనాథాశ్రమాల్లో 3900 మందికి పైగా అనాథలు

మహారాష్ట్ర ప్రభుత్వం అనాథల పట్ల విశాల హృదయంతో స్పందించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్య, ఉద్యోగాల్లో వారికి 1 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, దీన్ని చట్టంగా మార్చేందుకు అవసరమైన ప్రభుత్వ ముసాయిదా మాత్రం నిన్నే జారీ అయింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై రాష్ట్రస్థాయిలో జరిగే అన్ని విద్య, ఉపాధి నియామకాల్లో అనాథలకు 1 శాతం రిజర్వేషన్ లభించనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రవేశం, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలోనూ వారికి ప్రాధాన్యమివ్వనున్నారు.

అనాథాశ్రమాల్లో ఉంటున్న వారు లేదా తమ తల్లిదండ్రులు లేదా తమ బంధువులను గుర్తించలేని వారు, తమ కులమేంటో తెలియని వారు ఈ రిజర్వేషన్ పొందడానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది. అయితే తాను అనాథ అని ధ్రువీకరిస్తూ రాష్ట్ర మహిళా-శిశు సంక్షేమాభివృద్ధి శాఖ జారీ చేసే ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాంటి సర్టిఫికెట్ ఉన్న వారు మాత్రమే రిజర్వేషన్ పొందడానికి అర్హులని తేల్చిచెప్పింది. తాజా రిజర్వేషన్ నిర్ణయం వల్ల అనాథలకు న్యాయం చేస్తున్నామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనాథాశ్రమాల్లో సుమారు 3900 మంది అనాథలున్నారు. ప్రైవేటు అనాథాశ్రమాల్లో ఉన్న వారిని కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

More Telugu News