నటి శ్రియ అభిమానులకు చేదువార్త...!

03-04-2018 Tue 10:39
  • రష్యాకి మకాం మార్చేందుకు సన్నాహాలు
  • విక్టరీ వెంకీతో ఒప్పుకున్న సినిమా కేన్సిల్
  • తీవ్ర నిరాశలో అభిమానులు
గత పదిహేడేళ్లుగా తెలుగు సినీ అభిమానులను తన అందచందాలతో అలరించిన ఢిల్లీ భామ శ్రియ ఇటీవల తన రష్యా ప్రియుడు ఆండ్రీ కోషీవ్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. చాలామంది హీరోయిన్లు వివాహమైన తర్వాత కూడా తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ చిరునవ్వుల చిన్నది కూడా అలాగే తన అభిమానులతో కనెక్టయి ఉంటుందని అంతా భావించారు.

ఈ మధ్య విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించేందుకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఆమె తన నటనా జీవితాన్ని కొనసాగిస్తుందని అభిమానులు సంతోషపడ్డారు. కానీ, ఆ ప్రాజెక్టును ఆమె వదులుకున్నట్లు తాజా సమాచారం. అందుకు కారణం, తన భర్త ఆండ్రీతో కలిసి ఆమె తన మకాంను రష్యాకి మార్చే పనిలో బిజీబిజీగా ఉందట. ఏకంగా ఈ దేశాన్నే విడిచిపోవడానికి ఈ సుందరి సిద్ధమైందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ (చేదు)వార్త తెలిసిన ఆమె వీరాభిమానులు ఇప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.