Pakistan: హఫీజ్ సయీద్ కి అమెరికా షాక్!

  • పాక్ సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటాలని భావించిన హఫీజ్ సయీద్
  • మిల్లీ ముస్లిం లీగ్ పార్టీని స్థాపించిన హఫీజ్  
  • హఫీజ్ సయీద్ జేయూడీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా

మిల్లి ముస్లిం లీగ్‌ (ఎంఎంఎల్‌) పార్టీని స్థాపించి పాకిస్తాన్‌ ఎన్నికల్లో సత్తాచాటాలని భావించిన పేరుమోసిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ కు అమెరికా షాకిచ్చింది. పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో మిల్లి ముస్లిం లీగ్‌ పార్టీ పోటీ చేసేందుకు హోం శాఖ అనుమతి తీసుకోవాలని పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ (పీఈసీ) ఆదేశించిన నేపథ్యంలో హఫీజ్‌ సయీద్‌ నేతృత్వంలోని జమాత్‌-ఉద్‌-దవా (జేయూడీ)ను ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించింది. అతనితో పాటు ఎంఎంఎల్ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఏడుగురు నాయకులను కూడా ఉగ్రవాదులుగా గుర్తిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

 అలాగే కశ్మీర్ లో లష్కర్‌-ఏ-తాయిబా (ఎల్‌ఈటీ) నడుపుతున్న తెహ్రిక్‌-ఈ-ఆజాదీ-ఈ-కశ్మీర్‌ (టీఏజేకే) ను కూడా ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ఆ ప్రకటనలో అమెరికా స్పష్టం చేసింది. దీంతో ఎంఎంఎల్ కు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ముద్రపడుతుందన్న భయంతో జేయూడీ పేర్లు మార్చుకుంటూ వస్తుండగా, దానిని గుర్తించిన అమెరికా, అది ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలోని కీలక నేతలను ఉగ్రవాదులుగా పేర్కొని చావు దెబ్బకొట్టింది.

 కాగా, జేయూడీ కాలక్రమంలో ఎల్ఈటీగా, ఆ తరువాత ఎంఎంఎల్ పార్టీ, టీఏజేకేగా వివిధ పేర్లు మార్చుకుని ఉనికిని చాటుకుంటోంది. దాని పన్నాగాలు పసిగట్టిన అమెరికా దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పాక్ ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తే అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాద దేశంగా నిలబడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ ఎలాంటి చర్యలు తీసుకోనుందోనన్న ఆసక్తి అంతర్జాతీయ సమాజంలో కలుగుతోంది.

More Telugu News