Vk Singh: ప్రభుత్వ ఉద్యోగం అంటే బిస్కెట్ల పంపిణీ కాదు.. ఇరాక్ మృతుల కుటుంబాలను అవమానించిన కేంద్రమంత్రి

  • ఇరాక్ మృతుల కుటుంబాలకు ఉద్యోగాలపై విలేకరుల ప్రశ్న
  • వీకే సింగ్ చిందులు
  • చెప్పేది అర్థం అవుతోందా? అంటూ ఆగ్రహం

విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలంటే బిస్కెట్ల పంపిణీ కాదంటూ విరుచుకుపడ్డారు. ఇరాక్‌లో ఉగ్రవాదుల చేతిలో ఊచకోతకు గురైన 38 మంది భారతీయుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఇలా స్పందించారు.

 ‘‘ఇదేమీ ఫుట్‌బాల్ ఆటకాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చాలా సున్నితమైనవి. మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు, పరిహారం అందించేందుకు విదేశాంగ శాఖ వారి వివరాలను కోరింది. దీనిని మేం సమీక్షిస్తాం’’ అని పేర్కొంటూనే.. ఉద్యోగాలు ఇవ్వడం అంటే బిస్కెట్ల పంపిణీ కాదని తేల్చి చెప్పారు. ఇది ప్రజల జీవితానికి సంబంధించిన విషయమని, ఈ విషయంలో తానెలా ప్రకటన చేస్తానని పేర్కొన్న మంత్రి, అసలు మీకు అర్థమవుతోందా? అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఇరాక్‌లో మృతి చెందిన 39 మందిలో 38 మంది భారతీయుల మృతదేహాలతో బాగ్దాద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం సోమవారం మధ్యాహ్నం 2:30లకు అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకుంది. మృతి చెందిన వారిలో మరొకరిని గుర్తించాల్సి ఉంది. 2014లో పని కోసం ఇరాక్ వెళ్లిన 40 మందిని మోసుల్‌లో ఉగ్రవాదులు అపహరించారు. అనంతరం వీరి చెర నుంచి ఒకరు తప్పించుకోగా మిగతా 39 మందిని ఉగ్రవాదులు హతమార్చారు. మొత్తం 40 మందిలో 27 మంది పంజాబ్‌కు చెందినవారు కాగా, మిగతావారు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారు.

More Telugu News