Bihar: బీహార్‌లో రాజకీయ రంగు పులుముకుంటున్న శ్రీరామ నవమి అల్లర్లు.. కేంద్రమంత్రి కుమారుడి అరెస్ట్

  • బీహార్‌లో జేడీయూ-బీజేపీ మధ్య పెరుగుతున్న దూరం
  • అరిజిత్ అరెస్టును తీవ్రంగా పరిగణిస్తున్న బీజేపీ
  • జై శ్రీరామ్ అన్నందుకే అరెస్ట్ చేశారన్న అరిజిత్

బీహార్‌లో అధికార జేడీయూ-బీజేపీ కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో కేంద్రమంత్రి అశ్వినీ కుమార్ చౌబే కుమారుడు అరిజిత్ శాశ్వత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతనెల 17 న భగల్‌పూర్‌లో అరిజిత్ శాశ్వత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపులో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు అరిజిత్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అతడి పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో శనివారం అర్ధరాత్రి అరిజిత్‌ను పట్నాలో అరెస్ట్ చేశారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది.

కుమారుడి అరెస్ట్‌పై స్పందించిన చౌబే తమపై బురద జల్లేందుకు అవినీతి అధికారులు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘భారత్ మాతా కీ జై’, ‘ జైశ్రీరామ్’ నినాదాలు చేసినందుకే తనను నేరస్తుడిని చేశారని అరిజిత్ ఆరోపించారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదిలేది లేదని ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ పేర్కొనగా, అరిజిత్ అరెస్ట్‌ను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది.

More Telugu News