Telangana: వచ్చే డిసెంబర్ నాటికి కొండపోచమ్మసాగర్ నీరందిస్తాం : మంత్రి హరీశ్ రావు

  • ఈ ప్రాజెక్టు పూర్తయితే 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు
  • సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి జిల్లాలు సస్యశ్యామలమవుతాయి
  • యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి

వచ్చే డిసెంబర్ నాటికి కొండపోచమ్మసాగర్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. గజ్వేల్ మండలం అక్కారం వద్ద కొండపోచమ్మకు చెందిన పంప్ హౌస్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండపోచమ్మ సాగర్ పూర్తయితే రెండు లక్షల 85 వేల ఎకరాలకు డిసెంబర్ నాటికి సాగునీరందుతుందని ఆయన చెప్పారు. ఒకే సంవత్సరంలో భూసేకరణతో పాటు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి రైతులకు నీరందించనున్న చరిత్ర దేశంలో తెలంగాణ ప్రభుత్వానికి -దక్కనున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కొనసాగుతున్న అనేక రకాల కుట్రలను రైతులే భగ్నం చేశారని, రైతులకు భూములు ఇవ్వొద్దని అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కోదండరాం అడ్డుపడినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న నమ్మకంతో రైతులే ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములిచ్చారని అన్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకు చెందిన అన్ని ప్యాకేజీలలోనూ యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, కొండపోచమ్మ రిజర్వాయర్ వల్ల సిద్దిపేట జిల్లాతో పాటు, మేడ్చల్, యాదాద్రి జిల్లాలకు సాగు నీరుతో పాటు హైదరాబాద్ నగరానికి తాగు నీరందుతుందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని 19 జిల్లాలలో బీడుబారిన పొలాలు గోదావరి జలాల రాకతో పచ్చని పంట పొలాలుగా మారనున్నాయని, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లతో సిద్ధిపేటకు జలకవచం ఏర్పడనుందని హరీశ్ రావు అన్నారు.

More Telugu News