Lepakshi: నాలుగేళ్లుగా మాట్లాడని పవన్ కల్యాణ్ యూ-టర్న్ తీసుకోలేదా?: చంద్రబాబు

  • విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన చంద్రబాబు
  • తనను బలపరచాల్సిన వేళ బలహీనపరచాలని చూస్తున్నారు
  • లేపాక్షి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తాను యూ-టర్న్ తీసుకున్నానని విపక్షాలు చేస్తున్న విమర్శలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. లేపాక్షిలో మొదలైన ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. గడచిన నాలుగేళ్లుగా ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కల్యాణ్ యూ-టర్న్ తీసుకుని తనను లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్నారని ఆరోపించారు.

 హోదా కోసం శ్రమిస్తున్న తనను బలపరచాల్సిన సమయంలో, బలహీన పరిచేలా ఎత్తులు వేస్తున్నారని అన్నారు. హక్కులు సాధించేందుకు న్యాయపోరాటం, ధర్మపోరాటానికి దిగానని చెప్పిన చంద్రబాబు, ఈ ప్రయాణంలో ఆగేది లేదని అన్నారు. ఎన్డీయేను, నరేంద్ర మోదీని తాను నమ్మానని, వారు సాయం చేస్తారని, నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించానని, అందుకే పొత్తు పెట్టుకున్నానని తెలిపారు.

బీజేపీతో కలసి ఎవరు నాటకాలు ఆడుతున్నారో ప్రజలు గుర్తించాలని, ఎన్నికలు జరగనున్న సమయం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. తాను ఎవరికీ భయపడేవాడిని కాదని చెప్పిన ఆయన, ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ నాడు పార్టీని పెట్టారని, తానిప్పుడు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తున్నానని అన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతూ ఉంటే తాను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నారని, తాను రాజీపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. హోదా కోసం నిరసనలు తెలియజేసే వేళ, అహింసా మార్గాన్ని అనుసరించాలని ప్రజలకు సలహా ఇచ్చారు.

More Telugu News