Balakrishna: శ్రీకృష్ణ దేవరాయల వేషంలో రథంపై వచ్చి అలరించిన బాలకృష్ణ

  • లేపాక్షి వేడుకలు ప్రారంభం
  • పాల్గొన్న చంద్రబాబు
  • మన సంస్కృతి కాపాడుకోవాలని పిలుపు

అనంతపురం జిల్లా లేపాక్షిలో రెండు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన లేపాక్షి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, సినీ నటులు హాజరయ్యారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఓ రథంపై శ్రీకృష్ణ దేవరాయల వేషధారణలో వచ్చి, ప్రసంగించి అలరించారు.

ఈ సందర్భంగా సాంస్కృతిక, సంగీత ప్రదర్శనలే కాకుండా ఆధ్యాత్మిక భావాన్ని కూడా అందిస్తామని బాలయ్య చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే, రాష్ట్ర విభజన తరువాత లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు.

ఆనాడు తన తండ్రి ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడారని, నేడు చంద్రబాబు కూడా అదే రీతిలో ఆంధ్రుల హక్కుల కోసం పోరాడుతున్నారని బాలయ్య అన్నారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావులను చంద్రబాబు, బాలకృష్ణ సన్మానించారు.  

More Telugu News