Pawan Kalyan: మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా చెబుతున్నా.. మరోసారి ఆలోచించుకోండి!: పవన్ కల్యాణ్ కు మురళీ మోహన్ సలహా

  • టీడీపీ కీలక నేతలకు ఇవ్వని ప్రాధాన్యతను పవన్ కు ఇచ్చారు
  • చంద్రబాబుతో నేరుగా చెప్పేంత చనువు పవన్ కు ఉంది
  • పవన్ వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు
టీడీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ ఎంపీ మురళీ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేను రోజుల ముందు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడిన పవన్ కల్యాణ్... హఠాత్తుగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఒకవేళ చంద్రబాబు తప్పు చేస్తుంటే... ఆయనతోనే నేరుగా చెప్పేంత చనువు పవన్ కు ఉందని చెప్పారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పందించారు.

టీడీపీలో ఉన్న కీలక నేతలకంటే ఎక్కువ ప్రాధాన్యతను పవన్ కు చంద్రబాబు ఇచ్చారని మురళీ మోహన్ తెలిపారు. ఆయన వస్తుంటే ఎదురెళ్లి తీసుకొచ్చి, తిరిగి వెళ్లేటప్పుడు కారు వరకు వెళ్లేవారని చెప్పారు. కీలక నేతలకు కూడా ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇవ్వని చంద్రబాబు... పవన్ కు మాత్రం ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. ఇంత అనుబంధం ఉన్నప్పుడు, ఏదైనా తప్పుగా అనిపిస్తే... 'మీరు తప్పు చేస్తున్నారు, కాస్త మార్చుకోండి' అని చంద్రబాబుకు పవన్ చెప్పి ఉండవచ్చని అన్నారు. నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే బలమైన ఆకాంక్ష ఉన్నప్పుడు ఇలా చేయాలని... మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడాలని ప్రశ్నించారు.

జరిగిందంతా చూస్తుంటే... పవన్ వెనక ఎవరో ఉండి చేయిస్తున్నట్టు కనిపిస్తోందని మురళీమోహన్ చెప్పారు. పవన్ ను ప్రేమించే వ్యక్తిగా ఆయనకు ఒక మాట చెబుతున్నానని... తనకు సంబంధించిన విషయాలపై పవన్ మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు.
Pawan Kalyan
Chandrababu
murali mohan

More Telugu News