whatsapp: వాట్సాప్ లో ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకున్నా... గుట్టు బయటపెడుతోన్న యాప్!

  • చాట్ వాచ్ పేరుతో థర్డ్ పార్టీ స్పై యాప్
  • దీని సాయంతో ఇతరుల వాట్సాప్ కదలికలపై నిఘా
  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో బండారం బట్టబయలు

టెక్నాలజీతో సౌకర్యమే కాదు, ఎన్నో చిక్కులు కూడా ఉంటాయని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ముఖ్యంగా ఈ టెక్నాలజీ యుగంలో వ్యక్తుల గోప్యతకు రక్షణ లేకుండా పోయింది. వాట్సాప్ లో ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకున్నా... వారి వివరాలను బయట పెడుతోంది ఓ యాప్. దాని పేరు చాట్ వాచ్. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ యాప్ పై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది.

వాట్సాప్ ను ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైనే వినియోగిస్తున్నారు. అతిపెద్ద సామాజిక మాధ్యమం కావడంతో సహజంగానే యూజర్లకు ప్రైవసీ అవసరం. అందుకోసం కొన్ని సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. వాటిని చాట్ వాచ్ ప్రశ్నార్థకం చేస్తోంది. మీరు ఎప్పుడు ఆన్ లైన్ లో ఉన్నారు, వాట్సాప్ లో ఎంత సేపు గడిపారు, తదితర సమాచారాన్ని ఈ యాప్ ఇతరులకు చేరవేస్తుంది.  

అంతేకాదు, ఈ యాప్ ఉంటే మీ కాంటాక్టుల్లోని ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఎంత సేపు చాట్ చేసుకున్నదీ చెప్పేస్తుందట. వాట్సాప్ లో మీకు తెలిసిన వ్యక్తి చివరిగా ఎప్పుడు చూశారన్నది లాస్ట్ సీన్ (చివరిగా ఎప్పుడు చూశారు) ఆప్షన్ చెబుతుంది. అయితే, ప్రైవసీ సెట్టింగ్స్ లో దాన్ని ఆఫ్ చేసుకుంటే ఇతరులకు తెలియదు. కానీ, చాట్ వాచ్ మాత్రం ఆ గుట్టు బయటపెడుతోంది. ఎప్పుడు నిద్ర కోసం మంచమెక్కారు, ఎంత సేపు నిద్రించారో కూడా చెబుతుందట. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఇందుకు వినియోగిస్తున్నట్టు ఆ సంస్థే చెబుతోంది. అయితే, ఇది థర్డ్ పార్టీ యాప్. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ సపోర్ట్ లేదు.

More Telugu News