KCR: అప్పుల్ని కూడా ఆదాయంగా చూపించిన ఏకైక సన్నాసి ప్రభుత్వం కేసీఆర్ దే: కాంగ్రెస్

  • తప్పుడు లెక్కలు చూపిస్తూ.. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నారు
  • కాగ్ రిపోర్డుతో పాలనలోని డొల్లతనం బయటపడింది
  • తెలంగాణను సర్వనాశనం చేశారు

కేసీఆర్ సర్కారు వ్యవహారశైలి పైన పటారం లోన లొటారం అనే విధంగా ఉందనే విషయం కాగ్ రిపోర్టుతో తేటతెల్లమయిందని కాంగ్రెస్ ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. లెక్కకు మించి అప్పులు చేస్తూ, వాటిని ఆదాయంగా చూపిస్తున్న ఏకైక సన్నాసి ప్రభుత్వం కేసీఆర్ దేనని ఆయన మండిపడ్డారు. 60 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాని, భారతదేశ చరిత్రలో కాని అప్పులను ఆదాయంగా చూపించిన పరిస్థితి లేదని చెప్పారు. అప్పులను ఆదాయంగా చూపించి, తప్పుడు లెక్కలు చూపించి, ప్రజలను మోసం చేస్తూ... దేశంలో తామే మిగులు రాష్ట్రమని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నదే ఇప్పుడు కాగ్ రిపోర్టులో వెలుగు చూసిందని అన్నారు. పరిపాలనలోని డొల్లతనాన్ని, తప్పుడు లెక్కలను కాగ్ బయటపెట్టిందని తెలిపారు. దేశంలోనే ధనిక రాష్ట్రమంటూ కేసీఆర్ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమే అనే విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. అధికారంలో కొనసాగే అర్హత కేసీఆర్ సర్కార్ కు లేదని శ్రవణ్ మండిపడ్డారు.

నియంత ముఖ్యమంత్రి, రబ్బర్ స్టాంపుల్లాంటి మంత్రులు, బానిసల్లాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, డూడూ బసవన్నలకంటే హీనమైన ఐఏఎస్ అధికారులు అందరూ కలసి నాలుగేళ్ల కాలంలో తెలంగాణను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఇదా మీ పరిపాలన? అంటూ శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News