Pakistan: చాలా ఏళ్ల తర్వాత.. అత్యంత భద్రత మధ్య పాకిస్థాన్ కు చేరుకున్న మలాలా

  • 2012లో మలాలాపై కాల్పులు జరిపిన తాలిబాన్లు
  • మెరుగైన చికిత్స కోసం బ్రిటన్ కు తరలింపు
  • అప్పటి నుంచి బ్రిటన్ లోనే ఉన్న మలాలా

ఉగ్రవాదుల దాడిలో చావువరకు వెళ్లి వచ్చిన సాహస బాలిక, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యుసుఫ్ జాయ్ ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి తన మాతృదేశం పాకిస్థాన్ లో అడుగుపెట్టింది. ఈ ఉదయం ఆమె తన తల్లిదండ్రులతో కలసి ఇస్లామాబాద్ లోని బెనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మలాలాకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. భద్రతా కారణాల రీత్యా మలాలా పర్యటన వివరాలను రహస్యంగా ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు. నాలుగు రోజుపాటు ఆమె పాకిస్థాన్ లో ఉండనున్నట్టు సమాచారం. తన పర్యటన సందర్భంగా పాక్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీతో మలాలా భేటీ కానున్నట్టు సమాచారం.

2012 అక్టోబర్ 9న మలాలాపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. బాలికా విద్య, మానవహక్కుల కోసం ప్రచారం జరిపిన ఆమెపై... స్కూలు బస్సులోకి చొరబడి కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు ఆమెను బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ కు తీసుకెళ్లారు. అక్కడే ఆమె తన చదువును కొనసాగించింది. అప్పటి నుంచి ఆమె బ్రిటన్ లోనే ఉంది. బాలిక విద్య, మానవ హక్కుల కోసం ఆమె చేసిన పోరాటానికి గాను 2014లో మలాలాను నోబెల్ శాంతి బహుమతితో సత్కరించారు.

More Telugu News