డేవిడ్ వార్నర్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ షాక్

28-03-2018 Wed 13:56
  • వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నిర్ణయం
  • కొత్త కెప్టెన్‌ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడి
  • క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలను బట్టి వార్నర్, స్మిత్‌లపై తదుపరి నిర్ణయం

'బాల్ ట్యాంపరింగ్' ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్‌కి ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బుధవారం గట్టి షాకిచ్చింది. తమ జట్టు కెప్టెన్‌గా అతన్ని తొలగిస్తున్నట్లు సన్ రైజర్స్ యాజమాన్యం ఈ రోజు ప్రకటించింది. త్వరలో కొత్త కెప్టెన్‌ పేరును ప్రకటిస్తామని ఫ్రాంచైజీ సీఈఓ కే.షణ్ముగం తెలిపారు.

బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్నర్ సహచరుడు స్టీవ్ స్మిత్‌ని ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ తమ జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించి, బాధ్యతలను అజింక్యా రహానేకి అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా, వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీసుకునే చర్యలను బట్టి తమ తదుపరి నిర్ణయం ఉంటుందని సన్ రైజర్స్ టీమ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ఇటీవల పేర్కొన్నారు.

వార్నర్, స్మిత్‌లపై సీఏ తీసుకునే చర్యలతో వారికి ఐపీఎల్‌లో ఆడే అవకాశమివ్వాలా? వద్దా? అన్న దానిపై టోర్నీ నిర్వాహకులతో పాటు బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.