devyani khobragade: కేంద్రంపై ఎట్టకేలకు విజయం సాధించిన విదేశాంగ శాఖ అధికారిణి

  • ఆమెకు జాయింట్ సెక్రటరీగా పదోన్నతి కల్పించాలని క్యాట్ ఆదేశం
  • ఇతర ప్రయోజనాలు కల్పించాలని ఉత్తర్వులు
  • క్రమశిక్షణ ఉల్లంఘన విచారణ పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి

విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతాధికారి దేవయాని కోబ్రాగడే విదేశాంగ శాఖపై పోరాటంలో విజయం సాధించారు. ఆమెకు జాయింట్ సెక్రటరీగా పదోన్నతిని 2016 నుంచి అమల్లోకి వచ్చేలా ఇవ్వాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశించింది. దేవయానిపై క్రమశిక్షణ ఉల్లంఘన విచారణను సకాలంలో పూర్తి చేయకపోవడాన్ని తప్పుబట్టింది.

2013లో దేవయాని కోబ్రాగడే అమెరికాలోని న్యూయార్క్ లో భారత కాన్సులేట్ కు డిప్యూటీ జనరల్ గా పనిచేస్తున్న సమయంలో అమెరికా పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం గుర్తుండే ఉంటుంది. భారత్ కు చెందిన పని మనిషికి తక్కువ చెల్లిస్తున్నారన్న అభియోగంపై ఆమెను అరెస్ట్ చేసి వివస్త్రను చేసి మరీ దర్యాప్తు చేయడం, దానిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేయడం జరిగిపోయాయి.

అనంతరం ఆమెపై విదేశాంగ శాఖ క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలతో విచారణ చేపట్టింది. అదింకా పూర్తి కాలేదు. 2016లో దేవయానికి ప్రమోషన్ రావాల్సి ఉంది. విచారణ పూర్తి కాకపోవడంతో పదోన్నతిని తిరస్కరించారు. దీంతో ఆమె క్యాట్ ను ఆశ్రయించారు. రెండు నెలల్లోగా ఆమెకు పదోన్నతి ఇవ్వాలని, అన్ని రకాల ప్రయోజనాలు కల్పించాలని క్యాట్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News