Kamal Haasan: నేను సీఎంనైతే ఆ ఫైలుపైనే తొలి సంతకం.... కమలహాసన్

  • తాను సీఎంనైతే లోకాయుక్త ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని ప్రకటన
  • విద్యార్థులు రాజకీయా గురించి తెలుసుకోవాలని సూచన
  • దక్షిణాదిలో లోకాయుక్తలేని ఏకైక రాష్ట్రం తమిళనాడు అని వెల్లడి

'మక్కళ్ నీది మయ్యమ్' పార్టీ ద్వారా తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించిన యూనివర్శల్ హీరో కమలహాసన్ తాను సీఎంనైతే లోకాయుక్త ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని చెప్పారు. దక్షిణ భారతదేశంలో అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ లేని ఏకైక రాష్ట్రం తమిళనాడు అని ఆయన అన్నారు. నిన్న పొన్నేరిలో ఆయన కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్తులో ఏ ఒక్క అవినీతి రాజకీయ నాయకుడూ అధికారం చేపట్టకుండా చేయాలంటే లోకాయుక్త అవసరమని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

విద్యార్థులు రాజకీయాల గురించి తెలుసుకోవాలే గానీ రాజకీయ వేత్తల మాదిరిగా మారిపోరాదని ఆయన సూచించారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కుతో మంచి నేతలను ఎన్నుకోవాలని కమల్ కోరారు. దాదాపు నెల రోజుల కిందట తమిళనాడులోని మధురైలో ఆయన తన పార్టీని ప్రకటించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు మరో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కొత్త పార్టీతో తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయ నేతగా మారిపోయిన కమల్...తనకు సమయం దొరికినప్పుడల్లా రజనీపై రాజకీయంగా సెటైర్లు విసురుతున్నారు.

More Telugu News