Andhra Pradesh: ఏపీలో ఇకపై ఫొటో గుర్తింపు ఆధారంగా రేషన్ సరుకులు

  • వేలిముద్రలు సరిపోని పక్షంలో ఈ పద్ధతిలో రేషన్ అందజేస్తాం
  • ఈ సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం
  • ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడి

వేలిముద్రలు సరిపోని పక్షంలో ఫొటో గుర్తింపు ఆధారంగా రేషన్ అందజేస్తామని, ఈ సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బి.జయనాగేశ్వర్‌రెడ్ది, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, కె. సర్వేశ్వరావు, పశీం సునీల్‍కుమార్, పరుపుల నారాయణమూర్తి, గిడ్డి ఈశ్వరి, మీసేవా, ఆర్.టి.జి.ఎస్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు ఆన్‌లైన్‌లో రేషన్ కార్డులు బదిలీ చేయించుకునే సౌకర్యంను సులభతరం చేయాలని, కఠినతరమైన నిబంధనల వల్ల అనేక మంది రేషన్ పొందలేకపోతున్నారని అన్నారు. పలువురు డీలర్లు ఉద్దేశపూర్వకంగానే వేలిముద్రలు సరిపోలేదంటూ వినియోగదారుల రేషన్ ని స్వాహా చేస్తున్నారని, రేషన్ సరుకులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు ఆర్.టి.జి.ఎస్‌లో చూపిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు ప్రత్తిపాటికి విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో పక్కాగృహం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉన్నా, లేకపోయినా సరే వారికి కిరోసిన్ ఇవ్వాలని, నూతన రేషన్ కార్డులను జారీ చేసేటప్పుడు కార్డులను లామినేషన్ చేయించి లబ్ధిదారులకు ఇవ్వాలని, రేషన్ కార్డుల్లో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడానికి మూడు కంప్యూటర్ లాగిన్స్ ఫాలో కావాల్సి వస్తోందని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కృషి చేస్తా 

ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రత్తిపాటి మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోనివారి రేషన్ పునరుద్ధరణ అధికారం వీఆర్‌వోలకు ఇచ్చామని, ‘మీ సేవ’లో రేషన్ కార్డులకు సంబంధించిన ఏ సమస్యా కూడా పెండింగ్‌లో ఉండేందుకు వీలు లేదని ఆదేశించారు. పదిహేను రోజులకు ఒక్కసారి మీ సేవా, ఆర్.టి.జి.ఎస్, ఎన్.ఐ.సి అధికారులతో సమీక్షించి రేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామని, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ‘మీ సేవా’ సర్వీసు ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News