PV Sindhu: ఫోర్బ్స్ ఆసియా జాబితాలో తెలుగు తేజం పీవీ సింధు

  • 'ఆసియా 30 అండర్ 30-2018' పేరుతో ఫోర్బ్స్ జాబితా రిలీజ్
  • మొత్తం 300 మందిలో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకి కూడా చోటు
  • మోడల్ భూమికా అరోరా, అథ్లెట్‌ శ్రుతి మంథనలకు కూడా స్థానం

స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధు అరుదైన ఘనత సాధించింది. 'ఆసియా 30 అండర్ 30-2018' పేరుతో ఫోర్బ్స్ కంపెనీ విడుదల చేసిన 13 విభాగాల్లో సత్తాచాటిన దాదాపు 300 మందికి పైగా వ్యాపారవేత్తలు (ఎంటర్‌ప్రెన్యూర్స్), ఇన్నోవేటర్ల జాబితాలో ఆమె చోటు దక్కించుకుంది. మూడు ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాని ఎంపిక చేసినట్లు ఫోర్బ్స్ తెలిపింది. వ్యక్తులు సాధించిన ఘనతలు చూపే విస్తృత ప్రభావం, వ్యాపారం లేదా క్రీడలు లేదా వృత్తుల్లో వారు చూపే సామర్థ్యం, దీర్ఘకాల ప్లేయర్‌గా కొనసాగేందుకు వారు ప్రదర్శించే శక్తిసామర్థ్యాలను బట్టి ఈ జాబితాను సిద్ధం చేశారు.

వినోదం, ఆర్థికం, వెంచర్ కేపిటల్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌లు, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సహా వివిధ రంగాలకు చెందిన వారిని ఫోర్బ్స్ ఎంపిక చేసింది. ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో అనుష్క శర్మ (సినిమా రంగం), పీవీ సింధు (అథ్లెట్, బ్యాడ్మింటన్)తో పాటు మోడల్‌ భూమికా అరోరా, సైనప్‌ సీఈఓ అశ్విన్‌ రమేష్‌, అథ్లెట్‌ శ్రుతి మంథన, హేడేకేర్‌ ఫౌండర్‌ దీపాంజలి దాల్మియా, హెల్త్‌సెట్‌గో ఫౌండర్‌ ప్రియా ప్రకాష్‌ వంటి యువ వాణిజ్యవేత్తలు, టెక్నోక్రాట్లు ఉన్నారు.

More Telugu News