Vijay Sai Reddy: నేను కాళ్లు మొక్కలేదు.. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు: విజయసాయిరెడ్డి

  • మోదీ కాళ్లకు నేను మొక్కలేదు
  • కేవలం నమస్కరించానంతే
  • చంద్రబాబే ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారు
రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొక్కారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఓ వైపు కేంద్రంపై అవిశ్వాసం పెట్టి... మరోవైపు ఈ పాదాభివందనాలు ఏమిటంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై విజయసాయి స్పందించారు. రాజ్యసభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఇదే విషయంపై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా తాను సంస్కారం కలిగిన వ్యక్తి నని... తనకు బద్ధ శత్రువైన చంద్రబాబు ఎదుటపడినా... ఆయనకు తాను నమస్కారం పెడతానని చెప్పారు. తన కంటే ముందు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మోదీ వద్దకు వెళ్లి నమస్కారం పెట్టారని... ఇందులో తప్పు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సుజనా చౌదరి తర్వాత తాను నమస్కారం పెట్టానని చెప్పారు.

భారతీయ సంస్కృతిని బాగా నమ్మే పార్టీ వైసీపీ అని... తాను కూడా సంస్కృతి కలిగిన వ్యక్తిని కనుకే మోదీకి నమస్కరించానని తెలిపారు. తన నమస్కారానికి ప్రతినమస్కారం చేసిన మోదీ... 'మీరు ఎలా ఉన్నారు?' అంటూ కుశల ప్రశ్నలు వేశారని చెప్పారు. చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం కాళ్లకు మొక్కినట్టు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నమస్కరించిన వారికి ప్రతినమస్కారం చేయడం సంస్కారమని... ఇలాంటి సంస్కారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని... అందుకే తనపై ఈ విధమైన ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి తాను పాదాభివందనం చేయలేదని... చేసినట్టు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vijay Sai Reddy
Narendra Modi
Rajya Sabha
Chandrababu

More Telugu News