Vice Chancellor: మధ్యప్రదేశ్‌ యూనివర్శిటీ హాస్టల్‌లో దారుణం...విద్యార్థినులను వివస్త్రలను చేసి తనిఖీలు....!

  • హాస్టల్ ఆవరణలో వాడిపారేసిన శానిటరీ ప్యాడ్ దర్శనం
  • అదెవరిదో చెప్పాలంటూ ఆగ్రహించిన వార్డెన్...వరుసగా నిలబెట్టి తనిఖీలు చేసిన వైనం
  • లోదుస్తులను సైతం పరిశీలించే యత్నం...వీసీకి విద్యార్థినుల ఫిర్యాదు..చర్యలకు హామీ

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఉన్న డాక్టర్ హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయం ఆవరణలోని రాణీ లక్ష్మీభాయ్ హాస్టల్‌లో దారుణం వెలుగుచూసింది. హాస్టల్ ఆవరణలో వాడిపారేసిన ఓ శానిటరీ ప్యాడ్ కనిపించడంతో అదెవరిదో చెప్పాలంటా విద్యార్థినులందరినీ వార్డెన్ పిలిపించింది. వారందరినీ ఒకచోట సమూహంగా నిల్చోబెట్టి ఒక్కొక్కరుగా బట్టలు విప్పాలని ఆదేశించింది. చివరికి వారి లోదుస్తులను కూడా పరిశీలించే ప్రయత్నం చేసింది.

దాదాపు యాభై మంది విద్యార్థినులను వివస్త్రలను చేసి తనిఖీలు చేశారు. ఈ తనిఖీలను వార్డెన్‌తో పాటు ఆమె సహాయకురాలు చేపట్టారని జీ మీడియా తెలిపింది. తనిఖీలతో బెదిరిపోయిన కొంతమంది విద్యార్థినులు వెక్కి వెక్కి ఏడ్చారు. మరుసటి రోజు ధైర్యం చేసి యూనివర్శిటీ ఉప కులపతి ఆర్పీ తివారీకి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఆయన హాస్టల్‌ని సందర్శించి, జరిగిన విషయం గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇదే విషయమై మీడియాతో మాట్లాడేందుకు విద్యార్థినులు నిరాకరించడం గమనార్హం.

  • Loading...

More Telugu News