Maharashtra: మహారాష్ట్ర రైతుల దైన్యస్థితి...'యూథనేసియా'కి అనుమతివ్వాలంటూ వినతి...!

  • పంటలకు గిట్టుబాటు ధరను కల్పించనందున యూథనేసియాకి అనుమతివ్వాలని 'మహా' రైతుల వినతి
  • హైవే నిర్మాణం కోసం తీసుకున్న భూములకూ నష్టపరిహారమివ్వలేదని ఆరోపణ
  • కుటుంబాలను పోషించలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడి
ప్రభుత్వం తమ పంటలకు గిట్టుబాటు ధరను కల్పించనందు వల్ల స్వచ్ఛంద మరణానికైనా (యూథనేసియా) తమకు అనుమతిని ఇవ్వాలంటూ మహారాష్ట్ర రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని బుల్ధానా జిల్లాకి చెందిన 91 మంది రైతులు ఈ మేరకు రాష్ట్ర గవర్నరు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌లకు ఓ లేఖ రాశారు. పంటలకు మద్దతు ధరను కల్పించకపోవడంతో పాటు ఇటీవల ఓ హైవే నిర్మాణం కోసం ప్రభుత్వం తమ వద్ద నుంచి కొనుగోలు చేసిన భూమికి కూడా ఇప్పటివరకు తమకు తగిన నష్టపరిహారం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కుటుంబాలను పోషించుకోవడం తమకు కష్టంగా మారిందని, తమకు యూథనేసియా తప్ప వేరే మార్గం కనిపించడం లేదని వారు చెప్పారు. కాగా, ఈ నెల 12న పంట రుణాలు, విద్యుత్ బిల్లుల మాఫీతో పాటు స్వామినాథన్ కమీషన్ సిఫార్సుల అమలును డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 వేల మందికి పైగా రైతులు 180 కిలోమీటర్ల మేర పాదయాత్రగా ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు రైతుల డిమాండ్లను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ అంగీకరించడంతో వారు ఆందోళన విరమించారు.
Maharashtra
Swaminathan Commission
Buldhana
Euthanasia
Farmer

More Telugu News