Pawan Kalyan: మనమే థర్డ్ ఫ్రంట్ పెట్టేస్తే... పవన్ కల్యాణ్ ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వని వామపక్షాలు!

  • వామపక్షాలతో సమావేశమైన పవన్ కల్యాణ్
  • తృతీయ కూటమిని ప్రారంభిద్దామని ప్రతిపాదన
  • ప్రత్యామ్నాయం కోసం ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్య

దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్వయంగా తృతీయ కూటమిని ప్రారంభించాలన్న యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం వామపక్షాలతో సమావేశమైన జనసేన అధినేత, తాజా రాజకీయ మార్పులు సహా పలు అంశాలపై చర్చిస్తూ, తన మనసులో ఉన్న థర్డ్ ఫ్రంట్ ఆలోచనను కూడా పంచుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వామపక్షాల నేతలకు తన మనసులోని ఆలోచనను చెప్పిన పవన్, ఇదే విషయాన్ని జాతీయ నేతల వద్ద ప్రస్తావించి, సిద్ధాంతాల పరంగా ఒకే భావజాలమున్న పార్టీలను ఏకం చేసే బాధ్యతలను సీపీఐ, సీపీఎం పార్టీలకే అప్పగిస్తానని వెల్లడించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాయని, ఇదే సమయంలో సరైన ప్రత్యామ్నాయం కోసం ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు సైతం ఎదురు చూస్తున్నాయని వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్, మూడో కూటమిని మనమే ఎందుకు ప్రారంభించకూడదని ప్రశ్నించినట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి. అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలసి నడుస్తున్న వామపక్షాలకు చెందిన రాష్ట్ర నేతలు, వెంటనే సమాధానం ఇవ్వలేదని సమాచారం.

More Telugu News