Australia: అవమానం వెంటే ఆస్ట్రేలియాకు ఘోర పరాజయం!

  • బంతితో బెంబేలెత్తించిన మోర్కెల్
  • రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆసీస్ ఆలౌట్
  • 322 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం
  • 4 టెస్టుల సిరీస్‌లో 2-1తో ముందంజ
బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయి విమర్శల ఊబిలో చిక్కుకుపోయిన ఆస్ట్రేలియాకు మరో పరాభవం ఎదురైంది. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఘోర ఓటమి చవిచూసింది. సఫారీ బౌలర్ మోర్నెమార్కెల్ దెబ్బకు కకావికలైంది. 9.4 ఓవర్లు వేసిన మోర్కెల్ 3 మెయిడెన్లు తీసుకుని 23 పరుగులిచ్చి 5 కీలక వికెట్లను నేలకూల్చాడు. అతడి దెబ్బకు కంగారూలు 107 పరుగులకే చాపచుట్టేశారు. ఫలితంగా దక్షిణాఫ్రికా 322 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 9 వికెట్లు తీసిన మోర్కెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో  255 పరుగులు చేసి ప్రత్యర్థి కంటే 56 పరుగులు వెనకబడింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ జట్టు 373 పరుగులు చేసి ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇదే ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆటగాడు కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఆసీస్ పరువును మంటకలిపాడు. బాల్ ట్యాంపరింగ్‌లో భాగస్వామ్యమైన కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు పదవులు కోల్పోయారు.

బాల్ ట్యాంపరింగ్‌పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడం, స్వయంగా ఆస్ట్రేలియా ప్రధాని కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం వల్లనేమో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆటగాళ్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరి దక్షిణాఫ్రికాకు టెస్టును సమర్పించుకున్నారు.
Australia
south africa
ball tampering
Smith
Morkel

More Telugu News