aadhaar: తినడానికి తిండే లేనప్పుడు ఇక గోప్యత హక్కుపై ప్రశ్నకు చోటేది?: ఆధార్ ను సమర్థించుకున్న కేంద్రం

  • ఆధార్ తో ఆహారం, సబ్సిడీలు నేరుగా పేదలకు 
  • నిధుల దోపిడీకి అడ్డుకట్ట
  • ఆధార్ డేటా పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకున్నాం
  • సుప్రీంకోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్ వేణుగోపాల్
ఆధార్ ను అన్ని సంక్షేమ పథకాలకు, పెట్టుబడులకు అనుసంధానించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. అయితే, పౌరులకు సంబంధించిన సమస్త సమాచారంతో కూడిన ఆధార్ ను ఈ విధంగా వినియోగించడం అన్నది గోప్యత హక్కుకు (రైట్ టు ప్రైవసీ) భంగకరమంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా కేంద్రం విధానాన్ని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సమర్థించుకునేలా ఈ రోజు వాదనలు వినిపించారు.

‘‘ఆహార పదార్థాలు, ఇతర సబ్సిడీలు నేరుగా పేదలకు చేరేందుకు ఆధార్ వీలు కల్పిస్తుంది. సంక్షేమ నిధుల దోపిడీని అడ్డుకుంటుంది. జీవించే హక్కు అన్నది కేవలం జంతువుల ఉనికికి సంబంధించినది కాదు. గౌరవంగా, జీవనోపాధితో జీవించే హక్కు. ఒకవేళ తినడానికి ఆహారం, ఉండడానికి ఇల్లు అంటూ లేకపోతే ప్రజల గోప్యత ప్రశ్నకు చోటేది?’’ అంటూ అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించారు. ఆధార్ డేటా పరిరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
aadhaar
Supreme Court

More Telugu News