madhav: శాసనమండలిలో చంద్రబాబు ప్రసంగానికి అడ్డుతగిలి మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. తీవ్ర వాగ్వివాదం

  • రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డే ఉంది-మాధవ్
  • భూసేక‌ర‌ణ‌, పున‌రావాసాల‌ ఖ‌ర్చును రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే పెట్టుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెప్ప‌లేదు
  • మరి ఆర్థిక నేరగాళ్లను ప్రధానమంత్రి ఎందుకు కలుస్తున్నారు?: చంద్రబాబు
  • కలుసుకోండి, కాపురాలు కూడా పెట్టుకోండి

పోలవరం ప్రాజెక్టు విషయంలో కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తుండ‌గా బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ అడ్డుత‌గిలారు. దీంతో మీరేం చెబుతారో చెప్పండంటూ చంద్ర‌బాబు కూర్చున్నారు. ఈ సంద‌ర్భంగా మాధ‌వ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డే ఉంద‌ని వ్యాఖ్యానించారు. భూసేక‌ర‌ణ‌, పున‌రావాసాల‌ ఖ‌ర్చును రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే పెట్టుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెప్ప‌లేద‌ని అన్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం పోల‌వ‌రం పున‌రావాసంపై దృష్టి పెట్టాల‌ని, అందుకు సంబంధించిన ప‌నులు చేయాల‌ని సూచించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై తాము స‌హ‌క‌రించ‌బోమ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పుడూ చెప్ప‌లేద‌ని అన్నారు. బీజేపీపై ఎవ్వ‌రూ అనుమానాలు వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, త‌మ పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌ని అన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం కాబట్టి సహకారం అందబోదని టీడీపీ అనుకోవడం భావ్యం కాదని అన్నారు.

 దీంతో చంద్రబాబు మళ్లీ మాట్లాడుతూ.. మరి ఆర్థిక నేరగాళ్లను ప్రధానమంత్రి ఎందుకు కలుస్తున్నారని నిలదీశారు. కలిశారా? లేదా? అని అడిగారు. పీఎంవోలో కూర్చోవడం, ప్రెస్ వారికి కనపడకుండా దాక్కోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు. నేరస్తులకు పీఎంవో గస్తీ కాస్తుందా? అని వ్యాఖ్యానించారు.

'ఏపీ ముఖ్యమంత్రిని కోర్టు బోనులో నిలబెట్టేవరకు మేము ప్రధానిని కలుస్తూనే ఉంటామని వైసీపీ నేతలు అంటున్నారు.. కలుసుకోండి, కాపురాలు కూడా పెట్టుకోండి.. పీఎంవోలో విజయ సాయిరెడ్డి దాగుడు మూతలు ఎందుకు? అవినీతి కేసుల్లో ఉన్న ఓ వ్యక్తి సీబీఐ మాజీ డైరెక్టర్‌ను కలిస్తే కేసు పెట్టారు తెలుసా? ఇలా కలవడం తప్పు' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

More Telugu News