Bengaluru: 2050 కల్లా మరో కేప్‌టౌన్ కానున్న బెంగళూరు...!

  • గత 30 ఏళ్లలో బెంగళూరులో 0.45 మిలియన్లకు పెరిగిన నీటి బోర్లు
  • బీజింగ్, కాబూల్, కరాచీలకు కూడా బెంగళూరు తరహా నీటి కష్టాలు
  • ప్రపంచంలోని కనీసం 200 నగరాల్లోని నీటి పరిస్థితిపై సీఎస్ఈ విశ్లేషణ

ఆఫ్రికా ఖండంలోని అత్యంత సంపన్నమైన నగరాల్లో కేప్‌టౌన్ ఒకటి. కానీ అది నేడు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఏకంగా ఈ ఏడాది జూన్-జులై నాటి కల్లా అక్కడ నీటి లభ్యత దాదాపు మృగ్యం కానుంది. ఈ పరిస్థితినే 'డే జీరో'గా పేర్కొంటారు. ఆ నగరమే కాదు మనదేశంలో 'సిలికాన్ సిటీ'గా పేరుగాంచిన 'ఐటీ' నగరం బెంగళూరు కూడా 2050 కల్లా నీటి బొట్టుకు కటకటలాడనుందని 'సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ)' తాజాగా విశ్లేషించింది. ప్రపంచంలోని కనీసం 200 నగరాల్లో నీటి పరిస్థితిని ఈ సంస్థ విశ్లేషించింది. ఈ వివరాలను సీఎస్ఈ తన 'డౌన్ టు ఎర్త్' సంచికలో ప్రచురించింది. నేడు అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా నిన్న ఈ వివరాలను సీఎస్ఈ వెల్లడించడం గమనార్హం.

బెంగళూరు నగరానికి సంబంధించినంత వరకు, నగరంలో నీటి బోర్ల సంఖ్య గత 30 ఏళ్లలో 5 వేల నుంచి 0.45 మిలియన్లకు పెరిగింది. పట్టణీకరణ ప్రణాళిక సరిగా లేనందు వల్ల భూగర్భ జలాల స్థాయిల్లో పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటోంది. ముఖ్యంగా నగరంలో వ్యర్థ పదార్థాలను భారీ మొత్తాల్లో జలాశయాల్లో విసర్జిస్తున్నారు.

నీటి కొరతకు ఈ పరిణామం కూడా ప్రధాన కారణమని సీఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ అంటున్నారు. ప్రపంచంలో నీటి ఎద్దడిని ఎదుర్కోనున్న టాప్ 10 నగరాల జాబితాలో బెంగళూరు తర్వాత బీజింగ్ (చైనా), మెక్సికో నగరం, సానా (యెమెన్), నైరోబీ (కెన్యా), ఇస్తాంబుల్ (టర్కీ), సావో పౌలో (బ్రెజిల్), కరాచీ (పాకిస్థాన్), బ్యూనోస్ ఎయిర్స్ (అర్జెంటీనా), కాబూల్ (ఆఫ్గనిస్తాన్) ఉన్నాయి. కాగా, ప్రపంచంలోని 36 శాతం నగరాలు 2050 నాటి కల్లా తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోనున్నాయని, పట్టణ ప్రాంత నీటి అవసరాలు ప్రస్తుత స్థాయి నుంచి 2050 నాటికి 80 శాతం మేర పెరగనున్నాయని సీఎస్ఈ నివేదిక అంచనా వేయడం ఆందోళనకరమైన అంశం.

More Telugu News