Chandrababu: మూడు పార్టీల మహాకుట్ర... బీజేపీకి ముందుముందు కష్టకాలమే: చంద్రబాబు

  • జగన్, పవన్ ను అడ్డుపెట్టుకుని బీజేపీ మహాకుట్ర
  • దమ్ముంటే పార్లమెంట్ లో చర్చించండి
  • ప్రజలు ఇచ్చిన ఆధిక్యాన్ని బీజేపీ నిలుపుకోలేదు
  • తనను బలహీనపరచాలనే తప్పుడు ఆరోపణలు
  • ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

భారతీయ జనతా పార్టీ జగన్, పవన్ ను అడ్డు పెట్టుకుని తనపై కుట్ర చేస్తోందని, దమ్ముంటే ప్రత్యేక హోదాపై, రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై పార్లమెంట్ వేదికగా చర్చించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. ఈ ఉదయం ఎంపీలతో దాదాపు గంటన్నరకు పైగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, తనపై, ప్రభుత్వంపై మరింతగా కక్ష సాధించేందుకు బీజేపీ సిద్ధపడిందని, అందుకు మానసికంగా సిద్ధపడాలని సూచించారు.

బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు పెడధోరణిలో ఉన్నాయని, తన ఇమేజ్ ని దెబ్బతీయడమే వారి ప్రధాన అజెండా అని నిప్పులు చెరిగిన చంద్రబాబు, ఈ మూడు పార్టీలూ కలసి మహాకుట్ర పన్నాయని ఆరోపించారు. విభజన చట్టంలోని హోదా మినహా మిగతా 19 అంశాలు, ఆరు హామీలపై ఏనాడు కూడా వైసీపీ ప్రశ్నించలేదని మండిపడ్డారు. భారతదేశ చరిత్రలో ఒక్క తెలుగుదేశం మాత్రమే ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించిందని, ఇదే బీజేపీకి కంటగింపు అయిందని, అందువల్లే తనను బలహీనపరచాలని బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు.

404 మంది ఎంపీలను గెలిపించుకున్న రాజీవ్ గాంధీ, ఐదు సంవత్సరాల్లోనే బలహీనపడ్డారని, తరువాతి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఆధిక్యతను నిలుపుకోలేక పోయారని గుర్తు చేసిన చంద్రబాబు, ఇప్పుడు బీజేపీకీ అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. ప్రజలు ఇచ్చిన పూర్తి ఆధిక్యతను నిలుపుకునే పరిస్థితిలో బీజేపీ లేదని అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని, అభివృద్ధికి సహకరించాలన్నదే తన అభిమతమని, ఈ దిశగా పోరాటం ఒక్కటే ఇప్పుడు మన ముందున్న మార్గమని అన్నారు. జాతీయ రహదారుల దిగ్బంధం సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు.

More Telugu News