Iraq: ఆ 39 మంది భారతీయుల మరణం వెనకున్న రహస్యమిది!

  • మూడేళ్ల క్రితమే బందీలను చంపేసిన ఉగ్రవాదులు
  • విషయాన్ని అప్పుడే చెప్పిన హర్జిత్
  • బతికే ఉన్నారంటూ అవాస్తవాలు చెప్పిన కేంద్రం
  • ఇప్పుడు పార్లమెంట్ లో మరణాలను ధ్రువీకరించిన సుష్మా
  • తమ గతేంటంటున్న బాధిత కుటుంబాలు

"మూడేళ్ల క్రితం ఇరాక్ లోని మోసుల్ లో ఇండియా నుంచి పొట్ట చేతపట్టుకుని వెళ్లిన 39 మందిని అక్కడి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి చంపేశారు. వారి అవశేషాలను తెప్పిస్తున్నాం" రెండు రోజుల క్రితం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్ లో చేసిన ప్రకటన ఇది. వీరంతా పంజాబ్, బిహార్, హిమాచల్‌ ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ కు రాష్ట్రాలకు చెందినవారు.

వాస్తవానికి వీరంతా ఎప్పుడో మరణించారని, మొత్తం 40 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేయగా, తాను పారిపోయి వచ్చానని హర్జిత్‌ అనే వ్యక్తి అప్పట్లోనే చెప్పగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని కొట్టిపారేసింది. అందరూ బతికే ఉన్నారని, వారిని విడుదల చేయించే ప్రయత్నం చేస్తున్నామని మూడేళ్ల పాటు చెబుతూ వచ్చిన కేంద్రం, ఇప్పుడు వారిని ఉగ్రవాదులు కాల్చిచంపారని చెబితే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మరోసారి మీడియా ముందుకు వచ్చి, తాను ఆనాడే వారు మరణించారన్న సంగతిని చెప్పానని అన్నందుకు హర్జిత్ ను పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టారు.

ఇక తామెలా ఉగ్రవాదులకు చిక్కిందీ హర్జిత్ తెలుపుతూ, ఓ భవన నిర్మాణ పనిలో నిమగ్నమై ఉండగా, ఉగ్రవాదులు అపహరించారని, ఆపై తమలో ఉన్న బంగ్లాదేశ్‌ పౌరులను మాత్రం విడిచిపెట్టారని చెప్పుకొచ్చాడు. ఆ మరుసటి రోజే, ఓ కొండపైకి తీసుకెళ్లి బందీలందరినీ వరసగా నిలబెట్టి కాల్చేశారని, తనకు కాలిలో తూటా దూసుకుపోగా, చనిపోయినట్టు నటించానని, ఉగ్రవాదులు వెళ్లిపోయిన తరువాత అతి కష్టం మీద భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించానని వెల్లడించాడు.

ఇక హర్జిత్ చెప్పిన విషయాన్ని ఇరాక్ నుంచి తమ దేశం చేరిన బంగ్లాదేశ్ పౌరులు కూడా ధ్రువీకరించారు. బందీలుగా చిక్కిన భారతీయులంతా చనిపోయారని కుద్రుల ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందినట్టు ఓ ఆంగ్రపత్రిక కూడా ప్రకటించింది. ఇలా వారి మరణంపై ఎన్నిమార్లు కథనాలు వస్తున్నా భారత సర్కారు మాత్రం ప్రతిసారి ఖండిస్తూనే వచ్చింది. ఆఖరికి మోసుల్ నగరం నుంచి ఉగ్రవాదులను వెళ్లగొట్టిన ఏడు నెలల తరువాత బందీలు చనిపోయారని ప్రకటించడం వెనుక అసలు ఉద్దేశమేంటన్నది ప్రభుత్వ వర్గాలే వెల్లడించాలి.

ఉగ్రవాదుల చెరలో చిక్కుకుని అదృష్టవశాత్తూ బయటపడ్డ వ్యక్తి నోటిని ఇప్పుడు మూయించే ప్రయత్నం జరుగుతోంది. ఇన్నేళ్లుగా బాధిత కుటుంబాలకు ఆశలు కల్పిస్తూ వచ్చిన కేంద్రం, ఇప్పుడు వారంతా మరణించినట్టు ప్రకటించడం వెనుక కారణాలేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

More Telugu News