Jagtial District: చెత్తకుప్పలో లక్ష రూపాయలు... వెతుకుతున్న వ్యక్తికి అప్పగించిన పారిశుధ్ధ్య కార్మికురాలు

  • మెట్ పల్లి కూరగాయల మార్కెట్ సమీపంలో చికెన్ షాప్ నిర్వహిస్తున్న జావేద్
  • గత రాత్రి షాప్ మూసే సమయంలో డబ్బులు, చికెన్ చెత్తను వేర్వేరు కవర్లలో తీసుకెళ్లిన జావేద్
  • లక్ష రూపాయల కవర్ ను చెత్తకుప్పలో పడేసి ఇంటికెళ్లిన వైనం 
పరాయి సొమ్ము పాముతో సమానమని భావించిన నిరుపేద పారిశుద్ధ్య కార్మికురాలు దొరికిన లక్ష రూపాయలను వాటి యజమానికి అప్పగించి నిజాయతీ చాటుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మెట్‌ పల్లి కూరగాయల మార్కెట్ సమీపంలో జావేద్‌ చికెన్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత రాత్రి దుకాణం బంద్‌ చేసే సమయంలో చెత్తను ఒక కవర్లోను, డబ్బులు మరో కవర్లోను పట్టుకుని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలో చెత్త కవరుకు బదులు డబ్బులున్న సంచిని చెత్తకుప్పలో పడేసి బైక్‌ పై ఇంటికి వెళ్లిపోయాడు.

ఉదయం లేచి డబ్బుల కోసం కవర్ తెరవగా, అందులో చెత్త ఉండడం చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో వెంటనే సంచీ కోసం గతరాత్రి పారేసిన చెత్తలో వెతకడం ప్రారంభించాడు. దానిని చూసిన పారిశుద్ధ్య కార్మికురాలు లక్ష్మి ఏం వెతుకుతున్నావని ఆరాతీసింది. డబ్బులు పారేశానన్న విషయాన్ని చెప్పాడు.

దీంతో డబ్బులు ఎక్కడికీ పోలేదని, అక్కడ దొరికిన ఆ డబ్బును తాను దాచి ఉంచానని తెలిపింది. దాచిన డబ్బును తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. లక్ష రూపాయల నగదు తన కంటపడినా ఎలాంటి అత్యాశకు పోకుండా తిరిగి ఇచ్చిన ఆమె నిజాయతీని చూసిన జావేద్ ఆమెకు నజరానాగా 5 వేల రూపాయలు అందజేశాడు. ఆమె నిజాయతీని మార్కెట్ లోని వారంతా మెచ్చుకున్నారు. 
Jagtial District
metpalli
1 lack money

More Telugu News