Pawan Kalyan: ఏపీకి ‘హోదా’తో పాటు విభజన చట్టంలో చెప్పినవన్నీ ఇవ్వాలి : పవన్ కల్యాణ్

  • ఏపీకి ఇస్తామని చెప్పినవన్నీ తప్పనిసరిగా ఇవ్వాలి
  • రాష్ట్రానికి నిధులిస్తే సరిపోతుందని నేనెప్పుడూ చెప్పలేదు
  • నా అభిప్రాయాలను పత్రికలు, ప్రసార మాధ్యమాలు వక్రీకరించాయి
  • ఓ ప్రకటనలో ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో చెప్పినవన్నీ ఇవ్వాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఏపీకి ఏది అవసరమో, ఏవి ఇస్తామని మాట ఇచ్చారో అవి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేర్చాలి. ప్రత్యేక హోదా, చట్ట ప్రకారం రావాలసిన నిధుల విషయంలో నేను చెప్పిన మాటలను తప్పుగా అన్వయించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించి అర్థం చేసుకున్నారు. రాష్ట్రానికి నిధులు ఇస్తే సరిపోతుందని ఎప్పుడూ చెప్పలేదు.

 నిన్న ప్రసారమైన ఇంటర్వ్యూలో ప్రత్యేక హోదా విషయంలో నేను చెప్పిన అభిప్రాయాలను పత్రికలు, ప్రసార మాధ్యమాలు వక్రీకరించాయి. విభజన చట్టంలో చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన నిధులతో పాటు, అదనపు ఆర్థిక సహాయం కూడా అవసరం ఉంది. జనసేన పార్టీ ప్రత్యేకహోదాతో పాటు ఆర్థికపరమైన అన్ని నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక హోదా సాధనకు సంబంధించి కీలకంగా, సున్నితంగా ఉన్న ఈ తరుణంలో మాటలను, అభిప్రాయాలను ఎవరూ వక్రీకరించవద్దని మనవి చేస్తున్నాను’ అని ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

More Telugu News