funds: నిధులు ఇచ్చినట్టే ఇచ్చి, వెనక్కి తీసుకున్న కేంద్రం.. ఏపీ అసెంబ్లీలో ఘాటు చర్చ

  • బీజేపీని నిలదీసిన టీడీపీ
  • టెక్నికల్ సమస్య అన్న విష్ణు
  • దానం ఇవ్వడం లేదన్న యనమల

ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్టే ఇచ్చి, వెనక్కి తీసుకున్న అంశంపై ఈరోజు ఏపీ అసెంబ్లీలో ఘాటు చర్చ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులను వెనక్కి తీసుకోవడంపై బీజేపీ సభ్యులను టీడీపీ ఎమ్మెల్యేలు నిలదీశారు. దీనిపై బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదని... టెక్నికల్ సమస్య వల్లే ఇది వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం యూసీలు సమర్పించి ఉంటే నిధులు తప్పకుండా వస్తాయని తెలిపారు. విష్ణు సమాధానంపై కాల్వ శ్రీనివాసులు, కూన రవికుమార్ లు మండిపడ్డారు.

నిధులను ప్రధాని కార్యాలయం వెనక్కి తీసుకోవడం ఎన్నడూ జరగలేదని... దీనికి కారణం యూసీ కాదని... ప్రధాని కార్యాలయం అనుమతి లేదనే కారణంతో వెనక్కి తీసుకున్నారని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. రూ. 350 కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

కూన రవికుమార్ మాట్లాడుతూ, చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాల్సినవాటిని కేంద్రం ఇవ్వాల్సిందేనని చెప్పారు. కేంద్రం దానం ఇవ్వడం లేదని... చట్ట ప్రకారం ఇవ్వాల్సినవే ఇస్తోందని యనమల రామకృష్ణుడు అన్నారు. యూసీలు సమర్పించకపోతే అసలు నిధులే కేటాయించరని చెప్పారు. 

More Telugu News