Chandrababu: బీజేపీ నన్ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోంది: చంద్రబాబు

  • అమరావతిలో చంద్రబాబును కలిసిన ముస్లింలు
  • బీజేపీతో తెగదెంపులు చేసుకున్నందుకు ధన్యవాదాలు  
  • వైసీపీతో కలసి నన్ను అణగదొక్కాలనుకుంటున్నారన్న చంద్రబాబు

ఏపీకి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా భయపడబోనని... రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. అమరావతిలో ఈరోజు చంద్రబాబును ముస్లింలు కలిశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

విభజన హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరితే... వారు తనను అవహేళన చేశారని చంద్రబాబు చెప్పారు. ఏపీకి సాయం చేస్తారనే ఆశతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని... తన ఆశలను అడియాశలు చేశారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడబోనని ప్రధాని మోదీతో స్పష్టంగా చెప్పానని తెలిపారు. వైసీపీ లాలూచీ రాజకీయాలకు పాల్పడుతోందని చెప్పారు. వైసీపీ అండ చూసుకొని... టీడీపీని అణగదొక్కే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన పవన్ కల్యాణ్ తనపై విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ముస్లింల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉందని చెప్పారు.

More Telugu News