Chittoor MP: 'ఆ లింక్ పెట్టుంటే అప్పుడే మోదీకి మూడేది'... మహిళ వేషంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తిట్లు!

  • ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన శివప్రసాద్
  • నోట్ల రద్దు సమయంలో ప్రజల ప్రాణాలు పోయాయి
  • మంగళసూత్రానికి కూడా ఆధార్ లింకు పెడతారేమో?!

పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాల 11వ రోజు కూడా టీడీపీ, వైసీపీ ఎంపీలు తమ నిరసనలను కొనసాగించారు. సభకు వినూత్న వేషధారణతో వచ్చి, తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించే చిత్తూరు ఎంపీ శివప్రసాద్, నేడు మహిళ వేషధారణతో వచ్చారు. చీరకట్టుకుని వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, మహిళ ఆకాశంలో సగమని చెబుతుంటారని, అందుకే ఆంధ్రప్రదేశ్ మహిళగా తాను వచ్చానని, తన రాష్ట్రంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

 మహిళల సమస్యలను పరిష్కరించాలని మోదీకి విన్నవిస్తున్నానని, ప్రజా రక్షకుడిగా ఉండాల్సిన మోదీ ఆ పని చేయడం లేదని అన్నారు. "మోదీ రాగానే... అదేందండీ?... డీమానో, ఏమానో... మాను ఎత్తుకొచ్చి మామీద వేశాడు. బ్యాంకులో డబ్బులు పెట్టుకుని కూడా ప్రజలు అల్లాడాల్సి వచ్చింది. ఏటీఎంల కాడ నిలబడి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వలేదు. రూల్స్ అనినారు. మోదీ చెప్పినాడు అనినారు. చాలా మంది గుండె ఆపరేషన్లు జరగక చచ్చిపోయారు.

 నాకో డౌట్ వస్తోంది. చివరకు మంగళసూత్రానికి కూడా ఆధార్ కార్డుతో లింకు పెడతాడేమో మోదీ. హిందూ స్త్రీలకు ఆభరణాలంటే మక్కువ. ఆభరణాలకు కూడా లింక్ పెట్టాలని చూశారు. అది పెట్టుంటే తెలిసేది మోదీకి... అప్పుడే మూడి పోయుండేది. నాయనా... నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉద్యమిస్తారు. జాడించి కొడితే నువ్వు ఎక్కడో పోయి పడతావు. నువ్వు ఈ దేశానికి తగవు. చంద్రబాబులాంటి లీడర్ కు ద్రోహం చేస్తే ఇంకెక్కడ ఉంటావు?" అని నిరసన వ్యక్తం చేశారు.

More Telugu News