'సితార' చిత్రంతో జాతీయ అవార్డు పొందిన ఎడిటర్ అనిల్ మల్నాడ్ ఇక లేరు!

19-03-2018 Mon 10:52
  • 200 చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసిన అనిల్ మల్నాడ్
  • చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూత
  • సంతాపం తెలిపిన దక్షిణాది చిత్ర ప్రముఖులు

తెలుగు, తమిళం, హిందీ వంటి 9 భాషల్లో 200కు పైగా చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన అనిల్ మల్నాడ్ కొద్దిసేపటి క్రితం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన, చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు అనిల్ కుటుంబీకులు వెల్లడించారు.

తెలుగులో ఆయన ఎడిటర్ గా పనిచేసిన 'సితార' చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. తెలుగులో ఆయన వంశీ దర్శకత్వంలో వచ్చిన అన్వేషణ చిత్రంతో పాటు ఆలాపన, మంత్రిగారి వియ్యంకుడు, మహర్షి, అన్వేషణ, లేడీస్ టైలర్, శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ తదితర హిట్ చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు. ఆయన మరణం పట్ల దక్షిణాది చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలిపారు.