Kolkata: కేసీఆర్, మమతల భేటీపై జాతీయ మీడియా ఆసక్తి!

  • నేడు ప్రత్యేక విమానంలో కోల్ కతాకు కేసీఆర్
  • మధ్యాహ్నం తరువాత మమతతో సుదీర్ఘ చర్చ
  • కోల్ కతా చేరుకున్న జాతీయ మీడియా
  • ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తెలుగు టీవీ చానళ్లు

జాతీయ స్థాయిలో తృతీయ కూటమిని ఏర్పాటు చేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారతామని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్, నేడు కోల్ కతా వెళ్లి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో చర్చలు జరపనున్న వేళ, ఏం జరుగుతుందన్న విషయంపై జాతీయ మీడియా ఆసక్తిని చూపుతోంది.

ఈ ఉదయం 11 గంటల తరువాత బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లయిట్ లో కేసీఆర్ కోల్ కతాకు పయనం కానుండగా, మధ్యాహ్నం 2 గంటల తరువాత దాదాపు మూడు గంటల పాటు కోల్ కతా సెక్రటేరియేట్ లో కేసీఆర్, మమతల మధ్య భేటీ జరగనుంది. కేసీఆర్ తో పాటు ఎంపీలు కవిత, జితేందర్ రెడ్డి తదితరులు కోల్ కతాకు వెళ్లనున్నారు. ఇక ఇప్పటికే కోల్ కతాకు చేరుకున్న సీఎంఓ అధికారులు, కోల్ కతా ఎయిర్ పోర్టు నుంచి సెక్రటేరియేట్ వరకూ కేసీఆర్ ను తీసుకెళ్లే కాన్వాయ్ ని సిద్ధం చేసి, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు అన్ని జాతీయ మీడియా సంస్థలూ ఈ భేటీని ప్రత్యేకంగా కవర్ చేసేందుకు కోల్ కతాలో ఏర్పాట్లు చేసుకున్నాయి. పలు తెలుగు టీవీ చానళ్లు కోల్ కతా సెక్రటేరియేట్ ముందు ఇప్పటికే ఓబీ వ్యాన్ లను సిద్ధం చేసుకుని, రిపోర్టర్లను మోహరించాయి.

More Telugu News