మోదీని లేకుండా చేద్దాం, కదలండి: రాజ్ థాకరే

19-03-2018 Mon 08:59
  • అన్ని రంగాల్లో విఫలమైన మోదీ ప్రభుత్వం
  • విపక్షాలు కలిస్తే 'మోదీ ముక్త్ భారత్'
  • విచారణ జరిపిస్తే అతిపెద్ద స్కామ్ నోట్ల రద్దే
  • ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే
2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ నుంచి భారతావనికి విముక్తి కలిగించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే వ్యాఖ్యానించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆరోపించిన ఆయన, 2019 నాటికి 'మోదీ ముక్త్ భారత్' తన లక్ష్యమని అన్నారు. ముంబైలోని శివాజీ పార్క్ లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, నరేంద్ర మోదీ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు.

ఎన్డీయేకు వ్యతిరేకంగా అన్ని విపక్ష పార్టీలూ ఒకే దారిలో నడవాలని పిలుపునిచ్చారు. 1947లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిందని, ఆపై 1977లో అత్యవసర పరిస్థితుల తరువాత జరిగిన ఎన్నికల్లో ఇంకోసారి స్వాతంత్ర్యం వచ్చిందని, ఇక 2019లో మోదీ నుంచి ప్రజలకు ముక్తిని కలిగించడం ద్వారా మూడోసారి స్వాతంత్ర్యం వస్తుందని రాజ్ ధాకరే అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై విచారణ జరిపిస్తే, స్వతంత్ర భారతావనిలో అతిపెద్ద కుంభకోణం అవుతుందని అన్నారు. మహారాష్ట్రలో భూగర్భ జలాలు చాలా వేగంగా అడుగంటి పోతున్నాయని ఇస్రో ఇచ్చిన నివేదికను ప్రస్తావించిన ఆయన, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.