శ్రీదేవిది ముమ్మాటికి హత్యే.. పంచాంగ శ్రవణంలో ములుగు సిద్ధాంతి

19-03-2018 Mon 06:17
  • పంచాంగ శ్రవణంలో పేర్కొన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయ సిద్ధాంతి
  • తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి 
  • ఏపీ, తెలంగాణల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందన్న వరప్రసాద్

బాలీవుడ్ ప్రముఖ నటి శ్రీదేవిది హత్యేనని శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్‌ తేల్చి చెప్పారు. విళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆదివారం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధాంతి మాట్లాడుతూ శ్రీదేవిని ఆమె సన్నిహితులే హత్య చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ మరోమారు అధికారంలోకి వస్తుందని చెప్పిన ఆయన ఈ ఏడాది డిసెంబరులోగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే ప్రధాని మోదీకి అనుకూల ఫలితాలు వస్తాయన్నారు.

గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలలో బీజేపీ ప్రాభవం బాగా తగ్గుతుందని, ఆ పార్టీ సగానికి సగం సీట్లు కోల్పోతుందన్నారు. ఏపీ, తెలంగాణలలో బీజేపీకి ఒక్క పార్లమెంటు సీటు కూడా రాదని తేల్చి చెప్పారు. ఇక రాజకీయాల్లో అడుగుపెట్టిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాణిస్తాడని ములుగు సిద్ధాంతి పంచాంగ శ్రవణంలో వివరించారు.