Banking Regulation Act: బ్యాంకుల్లో మూలుగుతున్న ఆ 11 వేల కోట్లు ఎవరివి?

  • 64 బ్యాంకుల్లో మూడు కోట్లకు పైగా ఖాతాల్లో రూ.11302 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లు
  • అత్యధికంగా ఎస్‌బీఐ పరిధిలో రూ.1262 కోట్లు
  • ప్రైవేటు బ్యాంకుల్లో రూ.1416 క్లెయిమ్ చేయని డిపాజిట్లు
  • ఐసీఐసీఐలో అత్యధికంగా రూ.476 కోట్లు

64 బ్యాంకుల్లో మూడు కోట్లకు పైగా ఖాతాదారులకు సంబంధించిన దాదాపు రూ.11,302 కోట్లు మూలుగుతున్నాయని, వాటి కోసం ఎవరూ క్లెయిమ్ చేయడం లేదని రిజర్వు బ్యాంకు తాజాగా వెల్లడించింది. అందులో రూ.1262 కోట్ల సొమ్ము ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పరిధిలోని ఖాతాల్లో, మరో రూ.1250 కోట్ల సొమ్ము పీఎన్‌బీ ఖాతాల్లో ఉంది. ఇతర జాతీయ బ్యాంకుల ఖాతాల్లో రూ.7040 కోట్లు ఉన్నాయి.

 ఎవరూ క్లెయిమ్ చేయకుండా బ్యాంకుల్లో మూలుగుతున్న ఈ డిపాజిట్ల గురించి ఆర్‌బీఐ మాజీ చైర్ ప్రొఫెసర్ (ఐఐఎం-బీ) చరణ్ సింగ్ మాట్లాడుతూ...ఈ డిపాజిట్లలో ఎక్కువగా మరణించిన ఖాతాదారులవి లేదా పలు బ్యాంకు ఖాతాలున్న వ్యక్తులవి కావొచ్చని ఆయన అన్నారు. ఇందులో బినామీ ఖాతాలు ఉండే అవకాశముందని లేదా వీటిలోని కొన్ని ఖాతాల్లో ఉన్నది నల్ల డబ్బు కావొచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 26ఏ ప్రకారం, ఎవరైనా ఓ డిపాజిటర్ లేదా క్లెయిమ్‌దారుడు తన ఖాతా తెరిచి పదేళ్లు పూర్తయితే అందులోని డిపాజిట్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటారు. చాలాకాలంగా ఎలాంటి లావాదేవీలు జరపకుండా నిష్క్రియాత్మకంగా ఉన్న ఈ బ్యాంకు ఖాతాల్లోని డబ్బును 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌'లో ఉంచారు. క్లెయిమ్ చేయని సొమ్ము విషయంలో ప్రైవేటు బ్యాంకుల విషయానికొస్తే, యాక్సిస్, డీసీబీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, కోటక్ మహీంద్రా, యస్ బ్యాంక్‌లలో దాదాపు రూ.824 కోట్లు మూలుగుతున్నాయి.

మరో పన్నెండు ప్రైవేటు బ్యాంకుల్లో రూ.592 కోట్లు కలిపి మొత్తం ప్రైవేటు బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.1416 కోట్లున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు అత్యధికంగా రూ.476 కోట్లను, కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.151 కోట్లకు కలిగి ఉంది. ఇక మనదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బ్యాంకుల్లో రూ.332 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయి. ఒక్క హెచ్ఎస్‌బీసీలోనే రూ.105 కోట్లు ఉండటం గమనార్హం.

More Telugu News