Harish Rao: హరీశ్ రావు కారులో మంటలు... తృటిలో తప్పిన పెను ప్రమాదం!

  • మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఘటన
  • పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది
  • షెడ్యూల్ ప్రకారమే పర్యటన ఉంటుందన్న అధికారులు

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు గత రాత్రి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రయాణిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. కారు ఇంజన్ నుంచి తొలుత పొగలు వచ్చి, ఆపై మంటలు చెలరేగాయి. పొగలు వస్తుండటాన్ని గమనించిన డ్రైవర్, వెంటనే కారును ఆపగా, ఆ వెంటనే కారు మంటల్లో దగ్ధమైనట్టు తెలుస్తోంది.

 అనంతరం మంత్రి హరీశ్ రావు మరో కారులో మేడిగడ్డ నుంచి ఎల్అండ్ టీ క్యాంప్ వైపు వెళ్లిపోయారు. ఈ ఘటనతో మంత్రి షెడ్యూల్ లో ఎలాంటి మార్పులూ చేయలేదని అధికారులు తెలిపారు. అంతకుముందు హరీశ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. మూడు షిప్టుల్లో ఇక్కడ శరవేగంగా పనులు సాగుతున్నాయని చెప్పిన ఆయన వేసవి దృష్ట్యా రాత్రిపూట పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటివరకూ 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.

More Telugu News