ACB: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం... నాంపల్లి లేబర్ కోర్టు లా ఆఫీసర్ అరెస్ట్!

  • ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు
  • తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్
  • తన అరెస్ట్ అక్రమమంటూ కుప్పకూలిన అధికారి గాంధీ
  • ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై నాంపల్లి కార్మిక న్యాయస్థానం న్యాయాధికారి ఎం.గాంధీని పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. నిన్నటి నుంచి ఆయన్ను విచారిస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు తెల్లవారుజామున 3 గంటలకు గాంధీని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. వారాసిగూడలోని గాంధీ నివాసంతో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లో రెండు రోజులుగా సోదాలు జరుపుతున్న అధికారులు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఆయన అక్రమంగా కూడబెట్టినట్టు తేల్చారు.

అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడిన గాంధీ, తనపై వ్యక్తిగత కోపంతో బంధువుల్లోని కొందరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. వారసత్వంగా వస్తున్న ఆస్తులతో తనకు సంబంధం అంటగట్టి ఫిర్యాదు చేశారని, ఈ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పారు. తన భార్యకు ఆమె తల్లిదండ్రుల నుంచి వచ్చిన బంగారాన్ని కూడా అక్రమ ఆస్తి కింద లెక్కలు కడుతున్నారని ఆయన ఆరోపించారు.

కాగా, మీడియాతో మాట్లాడిన తరువాత గాంధీ స్పృహతప్పి పడిపోగా, ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసిన బంధువులను అధికారులు అడ్డుకున్నారు. తమ బృందంలోనే ఓ డాక్టర్ కూడా ఉన్నాడని, ఆయనే పరీక్షలు చేస్తాడని అధికారులు వెల్లడించగా, కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఆయన్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News