Class II veterinary doctor: అనిశా అరెస్టుకు బెదిరి రెండువేల నోటును మింగేసిన వెటర్నరీ వైద్యుడు..!

  • రెండు వేలు లంచంగా డిమాండ్ చేసిన వెటర్నరీ వైద్యుడు
  • ఏసీబీ ట్రాప్‌లో పడ్డానని గ్రహించి వెంటనే రెండువేల నోటును మింగేసిన వైనం
  • వైద్య పద్ధతుల్లో దానిని బయటకు తీసేందుకు అధికారుల ప్రయత్నాలు
అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు దొరికిపోతానేమోనని భయపడి గుజరాత్‌లోని పటాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ రెండో తరగతి వెటర్నరీ వైద్యుడు తాను లంచంగా తీసుకున్న రెండు వేల రూపాయల నోటును మింగేశాడు. వివరాల్లోకెళితే... నిందిత వైద్యుడు ఓ వ్యక్తి వద్ద నుంచి లంచంగా రూ.2 వేలు డిమాండ్ చేశాడు. అతను సరేనని చెప్పి, ఆ తర్వాత చెప్పిన సమయానికి ఇవ్వడంతో తీసుకుంటుండగా, డాక్టర్ కి డౌట్ వచ్చింది. తాను ఏసీబీ వలలో చిక్కుకుంటున్నట్లు ఆయనకు అనుమానం కలిగింది. దాంతో తన వద్ద ఉన్న రెండు వేల నోటును మింగేశాడు.

లంచం సొమ్ము తన వద్ద లేదని, తాను ఎవరి వద్దా లంచం తీసుకోలేదని ఏసీబీ అధికారుల వద్ద ఆయన బుకాయించాడు. దీంతో ఆయన కడుపులోని కరెన్సీ నోటును వైద్య పద్ధతుల్లో బయటకు తీసేందుకు ఏసీబీ బృందం నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా వారు తమ ప్రయత్నాలు కొనసాగించారు. అప్పటివరకు ఆయనపై అధికారులు కేసును నమోదు చేయలేకపోయారు. అవినీతి కేసుల్లో లంచం సొమ్మును రికవరీ చేయడం ఎల్లప్పుడూ ఓ ముఖ్యమైన అంశమని సీనియర్ ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితులు ఇలా సాక్ష్యాధారాలను మాయం చేయడం ఇదేమీ మొదటిసారి కాదని ఆయన అన్నారు. అయితే ఈ కేసు మాత్రం ప్రత్యేకమైనదని ఆయన చెప్పుకొచ్చారు.
Class II veterinary doctor
Bribe
ACB

More Telugu News