amaravathi: పని చేసే స్థలాల్లో మహిళలపై వేధింపులను సహించేది లేదు : ఏపీ మంత్రి పరిటాల సునీత

  • లైంగిక వేధింపులు లేకుండా పని చేయడం మహిళల హక్కు
  • 33 శాఖల్లో ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేశాం
  • ప్రైవేటు కార్యాలయాల్లో కూడా ఈ తరహా కమిటీలకు ఆదేశించా
  • ఏపీ మంత్రి పరిటాల సునీత

పని చేసే స్థలాల్లో మహిళలపై వేధింపులను సహించేది లేదని ఏపీ స్త్రీ,శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘పని చేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం’పై అవగాహనా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయ నిపుణులు, పోలీస్ శాఖ అధికారులు ఈ చట్టంలో ఉన్న విధివిధానాలను వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరిటాల సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2013వ సంవత్సరంలోనే ఈ చట్టాన్నిభారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని, ఈ చట్టంపై చాలా మందికి అవగాహన లేదని అన్నారు. పని చేసే స్థలాల్లో లైంగిక వేధింపులు లేకుండా గౌరవంగా పని చేయడం మహిళల హక్కుగా భారత ప్రభుత్వం కల్పించిందని, పని చేసే ప్రతి మహిళకు అవగాహన కల్పించేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
 ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేశాం

33 శాఖల్లో ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా, మండల స్థాయిలో కూడా ఈ తరహా కమిటీలను ఏర్పాటు చేసేందుకు అధికారులను ఆదేశించడం జరిగిందని సునీత చెప్పారు. కేవలం, ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో కూడా ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చెేయాలని ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు. మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించి ఆందోళనలకు గురికాకుండా ఈ కమిటీ చూసుకుంటుందని, సురక్షితమైన పని స్థలం కోరుకోవడం మహిళల హక్కు అని అన్నారు.

మహిళలు పని చేసే చోట ఏమైనా వేధింపులకు గురవుతున్నట్టయితే డిప్రెషన్ కు గురికావద్దని, తమ కుటుంబ సభ్యులతో లేదా తోటి వారికి ఈ విషయాన్ని చెప్పాలని, వేధింపులకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసేందుకు ముందుకురావాలని సూచించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కుటుంబం పరువు పోతుందనో, నిందితులు ప్రతీకారంతో ఏం చేస్తారో అని మహిళలు భయపడకుండా మహిళలు ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని అన్నారు. తద్వారా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయని అన్నారు.

కాగా, ఈ సమావేశంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సెక్రటరీ కె.సునీత, ప్రొఫెసర్ శాంతి, అడ్వకేట్ అనుపమ, ఇన్ స్పెక్టర్ అరుణ, సచివాలయ మహిళా ఉద్యోగుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News