Andhra Pradesh: మీరొక్కరే దేశాన్ని కాపాడుతారా.. మీ ఒక్కరికే దేశభక్తి ఉందా?: బీజేపీపై చంద్రబాబు నిప్పులు

  • రక్షణ బడ్జెట్ నిధులు అడిగేందుకు మాకు సంస్కారం లేదనుకుంటున్నారా?
  • మీరొక్కరే దేశాన్ని కాపాడుతారా?
  • మీ ఒక్కరికే దేశభక్తి ఉందా?
ప్ర‌త్యేక హోదాను ఇవ్వొద్ద‌ని 14వ ఆర్థిక సంఘం ఎక్క‌డా చెప్ప‌లేద‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నేతలు రక్షణ బడ్జెట్ కూడా ఇవ్వమని అడుగుతారని కేంద్ర మంత్రులు హేళన చేశారని, రక్షణ బడ్జెట్ నిధులు అడిగేందుకు తమకు సంస్కారం లేదనుకుంటున్నారా? అని చంద్రబాబు అన్నారు.

'మీరొక్కరే దేశాన్ని కాపాడుతారా, మీ ఒక్కరికే దేశభక్తి ఉందా, మాకు లేదా?' అని చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులను ప్రశ్నించారు. ఈ రోజు ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రతి ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారని, ఆ అంశాలన్నీ అమలు చేయాలని తాము కోరామని చెప్పారు. ఇచ్చిన మాటను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని, వెనక్కుతగ్గే సమస్యే లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. తమ మనోభావాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఏపీలో రెండంకెల వృద్ధి సాధించామని తెలిపారు. ఢిల్లీ కంటే గొప్ప రాజధానిని ఏపీలో నిర్మిస్తామని మోదీ అన్నారని, ప్రధాని అని ఆయనకు ఇన్నాళ్లు గౌరవమిస్తూ వచ్చానని, కానీ, ఆయన ఇప్పుడు అందరినీ తన మీదకు రెచ్చగొడుతున్నారని చంద్రబాబు అన్నారు. 
Andhra Pradesh
Special Category Status
Chandrababu

More Telugu News