somireddy chandramohan reddu: సినిమా ఇంటర్వెల్ వరకు హీరోలా ఉన్న పవన్ కల్యాణ్.. ఇంటర్వెల్ తరువాత ఇలా మారిపోయారేంటి?: సోమిరెడ్డి

  • పవన్ కల్యాణ్ ఇప్పుడు పన్నీరు సెల్వంలా మారిపోయారు
  • పవన్ కల్యాణ్ పక్షపాత భావజాలానికి మారిపోయాడు
  • బాబు, లోకేశ్ లను విమర్శించడానికే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పెట్టారా?

సినిమాలో ఇంటర్వెల్ వరకు హీరోలా ప్రవర్తించిన పాత్ర ఇంటర్వెల్ తరువాత ఒక్కసారిగా విలన్ గా మారిపోయినట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మారిపోయారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. పవన్ కల్యాణ్ ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ తన మనసు ఎవరి మీదైనా తొందరగా పారేసుకుంటారని, ఆ తరువాత మూడు నాలుగేళ్లకు ఆరేసుకుంటారని ఎద్దేవా చేశారు.

 తొలుత అన్న ప్రజారాజ్యం మీద మనసుపడ్డ పవన్ కల్యాణ్, తరువాత వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యాడని, ఇప్పుడు పక్షపాత భావజాలంలోకి మారిపోయాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్‌ లను విమర్శించడానికే పవన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పెట్టారా? అని ఆయన విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడతానని ప్రకటించిన పవన్‌, పన్నీరు సెల్వంలా ఎందుకు మారిపోయారో అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ విమర్శలు, ఆరోపణలను పవన్ కల్యాణ్ దత్తత తీసుకున్నట్టున్నారని ఆయన పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లను పెంచుతామన్న కేసీఆర్‌ ను పొగుడుతున్న పవన్, కాపు రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న చంద్రబాబును ఎలా విమర్శిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆవేశంలో జరిగిన ఒకట్రెండు సందర్భాలను ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తున్నారంటే ఎలా? అని ఆయన అడిగారు. పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఇల్లు నిర్మిస్తున్న చోట తాను కూడా ఇల్లు తీసుకుందామని భావిస్తున్నానని, అయితే స్థలం ఖర్చు ఆరేడు కోట్ల రూపాయలవుతుందంటున్నారని, అంత విలువైన భూమి పవన్ కల్యాణ్ కి 40 లక్షలకే ఎలా ఇచ్చారోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. హీరో మీద మోజుతో తక్కువ రేటుకిచ్చారేమోనని ఆయన వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.

More Telugu News