Alaska Airlines: మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన కెప్టెన్... అలస్కా ఎయిర్ లైన్స్ కో పైలట్ ఆరోపణ!

  • అలస్కా ఎయిర్ లైన్స్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
  • ఎయిర్ లైన్స్ కు వ్యతిరేకంగా కేసు పెట్టిన బాధితురాలు
  • ఇటువంటివి చాలానే జరుగుతున్నాయని ఫిర్యాదు
అలాస్కా ఎయిర్ లైన్స్ కెప్టెన్, తనకు మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడని కో పైలట్ బెట్టీ పినా సంచలన ఆరోపణలు చేసింది. విమానం డ్యూటీలు మారే నిమిత్తం తాము మిన్నేపోలిస్ లో సేదదీరుతున్న వేళ ఈ ఘటన జరిగిందని చెబుతూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. మూడు రోజుల పాటు తామిద్దరమూ కలసి పనిచేయాల్సి వచ్చిందని, తాను ఓ గ్లాస్ వైన్ తీసుకుని, రెండో గ్లాస్ ను చేతికి తీసుకున్నట్టు మాత్రమే గుర్తుందని, ఆపై తెలివి వచ్చేసరికి బెడ్ పై ఉన్నానని, తన లోదుస్తులు తొలగించి ఉన్నాయని, బెడ్ పై వాంతి చేసుకున్న స్థితిలో ఉన్నానని చెబుతూ, ఎయిర్ లైన్స్ కు, పైలట్ కు వ్యతిరేకంగా ఓ కేసును దాఖలు చేసింది.

జరిగిన ఘటనపై ఎయిర్ లైన్స్ యాజమాన్యానికి తాను ఫిర్యాదు చేసినా, చర్యలు తీసుకోకుండా అతన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించింది. గతంలో సైన్యంలోనూ పని చేసిన పినా, ఇటువంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయని ఆరోపించింది. ఇదే తొలికేసు కాదని, ఇదే చివరి కేసు కూడా కాదన్న సంగతి తనకు తెలుసునని, బాధ్యత తీసుకోవాల్సిన యాజమాన్యాలు అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని 'సియాటెల్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించింది. కాగా, పినా దాఖలు చేసిన లాసూట్ పై ఇప్పుడు అమెరికాలో చర్చ జరుగుతోంది. పనిచేసే చోట లైంగిక వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Alaska Airlines
Minepolise
Pilot
Captain
Harrasment
Rape

More Telugu News