Arvind Kejriwal: పంజాబ్ మంత్రికి క్షమాపణలు చెప్పిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తొలి సీఎంగా రికార్డు!

  • డ్రగ్స్ వ్యాపారంలో పంజాబ్ మంత్రి హస్తం ఉందని కేజ్రీవాల్ ఆరోపణలు
  • పరువు నష్టం దావా వేసిన మంత్రి బిక్రమ్ సింగ్
  • తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరిన ఢిల్లీ సీఎం

పంజాబ్ మంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజీథియాపై తాను చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. ఇందుకు సంబంధించిన లేఖను కోర్టుకు అందజేశారు. డ్రగ్స్ వ్యాపారంలో మంత్రి హస్తం ఉందంటూ కేజ్రీవాల్, ‘ఆప్’ నేత (ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు) సంజయ్ సింగ్, ఆశిష్ ఖేతన్‌లు ఆరోపించారు. తప్పుడు ఆరోపణలతో తన పరువును తీశారని ఆరోపిస్తూ మే 20, 2016న కేజ్రీవాల్, సంజయ్ సింగ్, ఆశిష్ ఖేతన్‌లపై కోర్టులో పరువునష్టం దావా వేశారు. ప్రస్తుతం అమృత్‌సర్ కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది.

తాజాగా కేజ్రీవాల్ తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పడంతో మజీథియా ఈ కేసును ఉపసంహరించుకోనున్నారు. కేజ్రీవాల్ క్షమాపణలపై మజీథియా మాట్లాడుతూ కేజ్రీవాల్ ఆరోపణలతో చిత్రహింసలు అనుభవించినట్టు చెప్పారు. అయితే తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఎదుర్కొన్నట్టు చెప్పారు. తాను చేసిన పొరపాటు ఆరోపణలకు సీఎం క్షమాపణలు చెప్పడం చరిత్రలోనే ఇది తొలిసారి అని అన్నారు. కేజ్రీవాల్, ఆశిష్ ఖేతన్‌లు క్షమాపణలు చెప్పడంతో కేసును ఉపసంహరించాల్సిందిగా తన న్యాయవాదులను కోరినట్టు మజీథియా తెలిపారు.

కోర్టుకు సమర్పించిన క్షమాపణల లేఖలో కేజ్రీవాల్ తన తప్పును అంగీకరించారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలు రాజకీయ అంశంగా మారిందని, అయితే, ఆ ఆరోపణలు నిజం కాదని తేలిందని పేర్కొన్నారు. ఇకపై ఈ విషయంలో రాజకీయాలకు తావులేదన్నారు. గతంలో మంత్రిపై చేసిన ఆరోపణలపై భేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. తన ఆరోపణలతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నొచ్చుకుని ఉంటే క్షమించాల్సిందిగా కేజ్రీవాల్ కోరారు.

  • Loading...

More Telugu News