KCR: మోదీకి ఎలాంటి గతి పట్టిందో.. రేపు కేసీఆర్ కు కూడా అలాంటి గతే పడుతుంది: తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి

  • కమిషన్లు ఇచ్చేవారికే బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు
  • పరిపాలనపై కేసీఆర్ కు పట్టు లేదు
  • అమరవీరుల కుటుంబాలతో టీఆర్ఎస్ కు బంధం తెగిపోయింది

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్ మొత్తం కేసీఆర్ తప్పుడు లెక్కలు, మాయ మాటలే ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. తప్పుడు బడ్జెట్ తో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేశారని విమర్శించారు. తమకు కావాల్సిన వారికి, కమిషన్లు ఇచ్చే వారికే బడ్జెట్ లో నిధులు కేటాయించారని ఆరోపించారు. అప్పులు తీసుకురావడం, అడ్డగోలుగా ఖర్చు చేయడం మాత్రమే కేసీఆర్ కు తెలుసని అన్నారు.

బడికి బయట ఉండే విద్యార్థిలాంటివారు కేసీఆర్ అని రేవంత్ విమర్శించారు. ఏనాడూ సచివాలయానికి రాని కేసీఆర్ కు... పరిపాలనపై పట్టు ఎలా దొరుకుతుందని అన్నారు. రైతులు, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగులు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి లెక్కలేదనే విషయం ఈ బడ్జెట్ తో మరోసారి తేలిపోయిందని చెప్పారు. ఈరోజుతో అమరవీరులకు, కేసీఆర్ ప్రభుత్వానికి బంధం పూర్తిగా తెగిపోయిందని అన్నారు. ఈ బడ్జెట్ తో కేసీఆర్ పని ఐపోతుందని... నిన్న ప్రధాని నరేంద్ర మోదీకి పట్టిన గతే రేపు కేసీఆర్ కు కూడా పడుతుందని చెప్పారు.

డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులు... 49వేల ఇళ్లకు కూడా సరిపోవని... మూడు లక్షల ఇళ్లను ఎలా నిర్మిస్తారని రేవంత్ ఎద్దేవా చేశారు. 2016-17 బడ్జెట్ లో ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 6వేల కోట్లను కూడా కేసీఆర్ దారి మళ్లించారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమని అన్నారు. అమరవీరులకు ఇస్తామన్న ఉద్యోగాలు, భూములు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. 

More Telugu News